తెలంగాణాకు తలమానికంగా ముచ్చింతల్: సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2022-02-05T03:24:27+05:30 IST

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజుల విగ్రహం

తెలంగాణాకు తలమానికంగా ముచ్చింతల్: సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజుల విగ్రహం తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. శనివారం నాడు ముచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను డీజీపి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ ముచ్చింతల్ మరో అద్భుత క్షేత్రంగా మారనుందన్నారు. ప్రపంచంలోని వైష్ణవ ఆరాధకులకు ప్రధాన క్షేత్రంగా మారుతుందన్నారు.


డీజీపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టిందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదన్నారు. కేవలం ప్రత్యేక పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉత్సవాల కోసం దాదాపు 8 వేలకుపైగా పోలీసు అధికారులచే బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించడం జరుగుతుందని, మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 

Updated Date - 2022-02-05T03:24:27+05:30 IST