MS Dhoni: సస్పెన్స్‌కు తెరదించిన ధోనీ.. తర్వాతి ప్రకటన ఏంటంటే?

ABN , First Publish Date - 2022-09-26T00:35:57+05:30 IST

అభిమానులకు తాను ఈ నెల 25న (ఆదివారం) ఓ అద్భుతమై వార్త చెబుతానంటూ అభిమానులను సస్పెన్స్‌లో

MS Dhoni: సస్పెన్స్‌కు తెరదించిన ధోనీ.. తర్వాతి ప్రకటన ఏంటంటే?

న్యూఢిల్లీ: అభిమానులకు తాను ఈ నెల 25న (ఆదివారం) ఓ అద్భుతమై వార్త చెబుతానంటూ అభిమానులను సస్పెన్స్‌లో ముంచెత్తిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) తాజాగా, ఆ ఉత్కంఠకు తెరదించాడు. ఓ బిస్కెట్ బ్రాండ్‌కు ప్రచారం చేయబోతున్నట్టు వెల్లడించాడు. ఓ కార్యక్రమంలో రిపోర్ట్‌ను వేదికపైకి ఆహ్వానించిన ధోనీ.. 2011లో బిస్కెట్ బ్రాండ్ లాంచ్ అయినప్పుడే ఇండియా ప్రపంచకప్ గెలుచుకుందని చెప్పాడు. ఈ ఏడాది మరో ప్రపంచకప్ ఉందని, ఈ బిస్కెట్ బ్రాండ్‌ను మళ్లీ లాంచ్ చేస్తే ఇండియా మరో కప్‌ను గెలుచుకుంటుందని అన్నాడు. కాబట్టి ఆ చరిత్రను రిపీట్ చేసేందుకు 2011ను తాను మరోమారు తీసుకొస్తున్నట్టు చెప్పాడు. హిస్టరీని మనం రిపీట్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. 


ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోనీ ఒకడు. మూడు ఐసీసీ ట్రోఫీలు.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధోనీ 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 17,266 పరుగులు చేశాడు. ‘మిస్టర్ కూల్’గా పేరు తెచ్చుకున్న ధోనీ మైదానంలో తాను అలా ఎలా ఉండగలుగుతానన్న దానిపై ఇటీవల మాట్లాడుతూ.. భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. వారు క్యాచ్‌ను ఎందుకు మిస్ చేశారు? లేదంటే మిస్‌ఫీల్డ్ ఎందుకైందన్న దానిపై దాను ఫీల్డర్ల వైపు నుంచి ఆలోచిస్తానని చెప్పాడు. కుర్రాళ్లపై కోప్పడడం వల్ల ఉపయోగం ఉండదని, స్టేడియంలో 40 వేల మంది, టీవీల్లో కోట్లాదిమంది చూస్తుంటారని అన్నారు. తాను కారణం కోసం మాత్రమే వెతుకుతానని ధోనీ చెప్పుకొచ్చాడు.  


డిసెంబరు 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న ధోనీ మూడేళ్ల తర్వాత 2017లో టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 15 ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతనిధ్యం వహిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతానని ధోనీ ప్రకటించాడు. 

Updated Date - 2022-09-26T00:35:57+05:30 IST