ధోనీ నన్ను తుది జట్టు నుంచి తొలగించాడు.. అప్పుడు సచిన్ అడ్డుకోకపోయి ఉంటే..: Virender Sehwag

ABN , First Publish Date - 2022-06-03T01:35:11+05:30 IST

తన బ్యాటింగ్‌తో టెస్టు ఓపెనర్ అర్ధాన్నే మార్చేసిన సెహ్వాగ్ భారత్ తరపున మొత్తంగా 104 టెస్టులు, 251 వన్డేలు

ధోనీ నన్ను తుది జట్టు నుంచి తొలగించాడు.. అప్పుడు సచిన్ అడ్డుకోకపోయి ఉంటే..: Virender Sehwag

న్యూఢిల్లీ:  తన బ్యాటింగ్‌తో టెస్టు ఓపెనర్ అర్ధాన్నే మార్చేసిన సెహ్వాగ్ భారత్ తరపున మొత్తంగా 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.  వరుసగా 8586, 8273, 394 పరుగులు చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గానూ రికార్డులకెక్కిన సెహ్వాగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.


2008లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనను తుది జట్టు నుంచి తప్పించాడని, దీంతో తాను క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని గుర్తు చేసుకున్నాడు. అయితే, సచిన్ టెండూల్కర్ తనను వారించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు చెప్పాడు. ‘క్రిక్‌బజ్’ షో ‘మ్యాచ్ పార్టీ’లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.


ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సమయంలోనే తాను టెస్టుల్లోకి పునరాగమనం చేశానని, ఓ టెస్టులో 150 పరుగులు కూడా చేశానని పేర్కొన్న సెహ్వాగ్.. వన్డేల్లో మాత్రం భారీ స్కోర్లు సాధించడంలో విఫలమైనట్టు చెప్పాడు. దీంతో అప్పటి కెప్టెన్ ధోనీ తనను తుది జట్టు నుంచి తప్పించాడని, దీంతో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించేద్దామని నిర్ణయించుకున్నానని వివరించాడు. 


అయితే, సచిన్ వారించడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పాడు. కెరియర్‌లో ఇదొక దుర్దశగా భావించాలని, సిరీస్ ముగిసిన తర్వాత ఇంటికెళ్లి ఆత్మపరిశీలన చేసుకోమని, ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోమని సచిన్ సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. దీంతో తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని, ఒకవేళ ప్రకటించి ఉంటే తాను కేవలం టెస్టులకే పరిమితమై ఉండేవాడనని సెహ్వాగ్ వివరించాడు. 


టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతడు సవాళ్లను స్వీకరించే తత్వం ఉన్నవాడని, విమర్శలకు కుంగిపోకుండా నిరంతరం తనని తాను మెరుగుపర్చుకుంటూ ఉంటాడని ప్రశంసించాడు. రెండో రకం వ్యక్తులు విమర్శలను పట్టించుకోరని, వారికి తాము ఏం చేయగలమన్న దానిపై స్పష్టత ఉంటుందని పేర్కొన్నాడు. తాను ఈ రకానికే చెందుతానని, తాను ఎవరినీ పట్టించుకోనని తేల్చి చెప్పాడు.  


ఆసీస్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చాక అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తనతో మాట్లాడడాని పేర్కొన్న సెహ్వాగ్.. ఏం చేద్దామని తనను అడిగితే, తాను ఫామ్‌లోనే ఉన్నా పక్కన పెట్టారని చెప్పానని పేర్కొన్నాడు. అన్ని మ్యాచుల్లోనూ జట్టులో తనకు స్థానం ఉందంటేనే వన్డేలకు ఎంపిక చేయాలని, లేదంటే లేదని శ్రీకాంత్‌కు తేల్చి చెప్పాని అన్నాడు. ఆ తర్వాత అదే ఏడాది ఆసియా కప్ సందర్భంగా ధోనీతో శ్రీకాంత్ మాట్లాడాడని, ఆ తర్వాత ధోనీ కూడా తనతో మాట్లాడాడని చెప్పాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావని ధోనీ తనను అడిగితే, బ్యాటింగ్ స్థానం కాదని, అన్ని మ్యాచుల్లోనూ ఆడే అవకాశం ఇస్తే చాలని చెప్పానని సెహ్వాగ్ వివరించాడు. 


Updated Date - 2022-06-03T01:35:11+05:30 IST