Abn logo
Jul 27 2021 @ 01:45AM

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ‘దళిత బంధు’ : మందకృష్ణ మాదిగ

సమావేశంలో అభివాదం చేస్తున్న మందకృష్ణ మాదిగ, దళిత నేతలు

ఖైరతాబాద్‌ జూలై 26 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకం కేవలం హుజురాబాద్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం లక్డీకాపూల్‌ సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో షెడ్యూల్డ్‌ కులాల సమగ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో తీర్మానించిన అంశాలను ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌ వివరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి దళితుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పథకం అమలును ఎన్నికల నోటిఫికేషన్‌లోపు హుజురాబాద్‌లో అమలు పరచాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి 7 సంవత్సరాలుగా దళితులకు చేసిన మోసాలను ఎలా మరువగలమని ఆయన ప్రశ్నించారు. 


తీర్మానించిన అంశాలు 

- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరద బాధితులకు 10వేల ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికల అనంతరం మోసం చేసిన ప్రభుత్వం, దళిత బంధు పథకం అమలు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు వెయ్యి కోట్లు ఇవ్వలేనివారు ఇప్పుడు లక్ష కోట్లు ఎలా ఇస్తారు.  

- హుజురాబాద్‌లో ఉన్న 20,900 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నోటిఫికేషన్‌లోపు అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి. హుజురాబాద్‌లో 100 శాతం అమలు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో అమలు పూర్తి చేయాలి

-  సీఎం మొదట నియోజకవర్గానికి 100 మందికి అంటూ 1200 కోట్లని, రెండో సారి 2వేల కోట్లు అన్నారు., మూడో సారి లక్ష కోట్లు అన్నారు. ఆయన మొదట ఆ కన్య్ఫూజన్‌ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో పూర్తిగా దళిత బంధు అమలుకు 2లక్షల 38 వేల కోట్లు అవుతాయని గుర్తించి స్పష్టమైన ప్రకటన చేయాలి.  

- ఎన్నికల కంటే ముందే మంత్రి వర్గంలో దళిత ప్రాతినిధ్యం కల్పించాలి.  ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చి కొప్పుల ఈశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. 

- దళిత బందు దాని కోసం ప్రతి బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు మంజూరు చేయాలి. ఈ మేరకు ఎన్నికల లోపు ప్రకటన చేయాలి.  

ఫ దళితుల నుంచి ప్రజా, ప్రభుత్వ అవసరా ల కోసం సేకరించిన భూమికి సమానంగా మరో చోట భూమిని కేటాయించాలి. 

ఫ ముఖ్యమంత్రి కార్యాలయంలో దళిత ఐఏఎస్‌ అధికారులు, సలహా మండలిలో దళిత మేధావులు, విద్యా వంతులు ఎంతమంది ఉన్నారో చెప్పాలి

ఫ  అగ్రవర్ణా ఆత్మగౌరవ భవనం కోసం హై టెక్‌ సిటీ ప్రాంతంలో 5 ఎకరాలు కేటాయిస్తే, అక్కడే దళితుల్లోని 60 కులాలకు ఒక్కొ కులానికి 5 ఎకరాలు కేటాయించాలి. వారికి ఒక ఎకరం కేటాయిస్తే దళితుల్లోని 60 కులాలకు 60 ఎకరాలు కేటాయించాలి. దీనిపై స్పష్టత ఇవ్వాలి. సీఎం 48 గంటలలోపు పై అంశాలపై ఇవ్వాలి.  

ఈ నెల 28న దళిత సంఘాల ఉమ్మడి  సమావేశం నిర్వహిస్తాం. సీఎం నిర్ణయంపై చర్చించి దళిత సంఘాల ఉమ్మడి ఆమరణ దీక్ష, హుజురాబాద్‌కు దళిత సంఘాల మహా పాదయాత్ర, లక్షలాది మంది తో హుజూరాబాద్‌ ముట్టడి లాంటి కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుం టాం. సమావేశంలో వేదిక ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యులు రాములు, దళిత మేధావి జేబీ రాజు. రాంప్రసాద్‌, రాజలింగం, డి.భాస్కర్‌, శంకర్‌, వీరేశం పాల్గొన్నారు. 

కాగా, సమావేశంలో మందకృష్ణ మాదిగ మీడియా యాజమాన్యాలు సహకరించాలని కోరారు. దళితులపై ఇతరులు చేసే ప్రకటనలను ఇత ర వార్తలను పెద్దగా చేసి చూపిస్తుండగా వాటిపై దళితుల స్పందనలు, ప్రభుత్వంపై విమర్శలను చిన్నగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు. దళితుల వాయి్‌సను ప్రజలకు చేర్చేందుకు సహకరించాలని కోరారు.