Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 19 Sep 2022 00:44:24 IST

మృత్యోర్మా అమృతంగమయ...

twitter-iconwatsapp-iconfb-icon
మృత్యోర్మా అమృతంగమయ...

ఆకాశ శోకాల ఆ భాద్రపద బహుళపంచమి నాడు చప్పున ఓ జెన్షన్‌ పువ్వుని చూశాను (నీకు తెలియకేం... 'Not every man has gentians in his house/ In Soft September, at slow, Sad Michaelmas... అని డి హెచ్‌ లారెన్స్‌ తెచ్చిచ్చిన Bavarian Gentian పువ్వు కదా). రౌరవాల చీకటిలా ముదురు ఊదారంగులో... అహస్సుని తమస్సు గుయ్యారాలలోకి ఆవలిస్తూ విచ్చిన పూరేకల ధూమ్ర ధూమవర్ణంతో... కోపుమీరు కొనలు దేరి పొగచూరు దీపంలా... Pluto అధోలోకాల నభోరజస్సువలె ఉన్న దుశ్శకునాల జెన్షన్‌ పువ్వుని చూసినప్పుడే తెలిసివచ్చింది, ఆకాశ శోకాల ఆ భాద్రపద బహుళపంచమి నాడు నీ మహాభినిష్క్రమణం!  


సాయంత్రం నాలుగ్గంటల వేళ ప్రళయ ఝంఝా గాలి రేగి చావుపుట్టుకల మధ్య ఊగే ఘంటికల్ని విరిచింది. ఇక్కడ చావు కనే కలల రాజ్యంలో గజిబిజి ఘర్షణల వైతాళిక ప్రతిధ్వనిలో అది పీడకలా... మరింకేదైనానా? నల్లబడ్డ నదీతలంలో అది కన్నీరు కక్కుతున్న ముఖమా? ఆ వైతరణీ నది ఆవల- నీ ఆత్మలో పలికే టిఎస్‌ ఎలియట్‌ - చూపిన నెగడు మంటలు చూశాను; యమకింకరుల శూలాలతో ఎగదోస్తున్న నెగడు మంటలు! నేను చూశాను- ఆ మృత్యునది ఆ ఒడ్డున రౌరవలోకాల రౌతులు దూసే శూలాలు!


ఎక్కడిదీ మృత్యుగానాల వానకోకిల,  థామస్‌ హార్డీ Darkling Thrush లా దిగులు ఋతువుల మడ్డి దిగ్గారి.. పగటి కన్నుని మసబార్చిన వేళ చిక్కుతీగల తలవాకిలిపై వాలి. తెగిన భగ్నవీణాతంత్రుల్లా దుర్బల బాహువులు చాచి ఊర్ధ్వలోకాలకి అల్లుకుపోతున్నాయా ఉద్వేగలతలు. దయ్యాలు తిరిగే ఆ దాపుల జనమంతా సుక్కారు ఇరుకుగదుల్లో. మట్టినేలల కాఠిన్యాకృతి శతాబ్దపు పార్థివదేహంలా కనిపిస్తున్నప్పుడు అతని పేటిక మేఘావృత మంటపం... గాలిరొద అతని మృతికి నివాళివిలాపం! 


మోడైన చివుకురెమ్మలపై నుంచి చప్పున రేగింది సాయంసంధ్యావందన శ్లోకం - ‘‘అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః....’’ నిండు హృదయంతో... నిరవధికానందంతో! ఆ గత్తర ఈకల అల్ప, అబల, వృద్ధ వానకోకిల పాడింది మించు వేదనల విషాదంలో తన ఆత్మనివేదన.


ఇప్పుడు నువ్వు కవిర్షి అలగ్జాండర్‌ పోప్‌ దివ్య మంత్రోచ్ఛాటనలతో వెలిగించిన 'Vital spark of heavenly flame' వి, జాజ్వల్యమాన జ్వాలాముఖ ప్రాణప్రమిదవి. నశ్వర పంజరాన్ని వీడి, ‘మృత్యోర్మా అమృతంగమయ...’ శ్లోకమార్గాల్లో తుళ్లుతూ... జోగుతూ... ఆశల ఆకాశాల్లోకి ఎగురుతూ అనాయాస అభినిష్క్రమణం.


నిసర్గ ప్రకృతీ! ఇక నిలిచిపో... పెనుగులాటలిక ఆపి, అతని పరిపూర్ణ జీవనలాలస నుంచి నిర్గమించు! అదిగో... అతని ఆత్మ ఆగమనానికి ఆహ్వానాలుగా ‘మధుర సుషమా సుధాగాన మంజువాటి’ వాసినుల గుసగుసలు. 


లోకం దూరమై మాయమై... కంటి ముందు స్వర్గాలు... చెవుల కింపు నాదాలు... మంగళతూర్యారావాలు... ఆత్మ  రెక్కలు సాచి ఎగసి... ఎగిరావు నువ్వు!

ఓ సమాధీ! ఎక్కడ నీ సాఫల్యం?

ఓ మృత్యువూ! ఏది నీ విషదంష్ట్రల కోర?

నరేష్‌ నున్నా

(సెప్టెంబర్‌ 15న కన్నుమూసిన సాహితీవేత్త సూరపరాజు రాధాకృష్ణమూర్తికి, డి హెచ్‌ లారెన్స్‌, 

టిఎస్‌ ఎలియట్‌, థామస్‌ హార్డీ, అలగ్జాండర్‌ పోప్‌ కవితలతో అల్లిన ఎలిజీ- )


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.