Abn logo
Sep 17 2021 @ 01:11AM

ఫలితాలకు ఓకే..!

  • పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా
  • ఫలితాలు ప్రకటించవచ్చని తీర్పు.. 19న కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి
  • ఏప్రిల్‌ 8న 61 జడ్పీటీసీలు, వెయ్యి ఎంపీటీసీల స్థానాలకు పోలింగ్‌ పూర్తి
  • ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ తప్పుబడుతూ మే 21న ఎన్నికలు రద్దు చేసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి
  • తీరా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ఓట్ల లెక్కింపునకు తాజాగా తీర్పు
  • ఏడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 12 కౌంటింగ్‌ కేంద్రాల్లో జరగనున్న ఓట్ల లెక్కింపు 
  • ఎంపీటీసీ స్థానాలకు 315, జడ్పీటీసీ స్థానాలకు 303 టేబుళ్లు ఏర్పాటుకు సన్నాహాలు

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. ఫలితాల వెల్లడికి రాష్ట్ర హైకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. పరిషత్‌ ఎన్నికలను రద్దుచేస్తూ మే 21న రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి  ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య బెంచ్‌ తోసిపుచ్చుతూ కౌంటింగ్‌ నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు వీలుగా అధికారులు గురువారం రాత్రి నుంచి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.  ఈనెల 19న ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ గురువారం రాత్రి  ప్రకటించింది. జిల్లాలో ఏప్రిల్‌ 8న 61 జడ్పీటీసీ, వెయ్యి ఎంపీటీసీ  స్థానాలకు పోలింగ్‌ జరిగింది. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఎన్నికలను రద్దుచేసింది. తిరిగి ఈ ఉత్తర్వులను ద్విసభ్య బెంచ్‌ గురువారం కొట్టి వేస్తూ ఫలితాల వెల్లడికి పచ్చజెండా ఊపింది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు 2020 మార్చి 9న అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇచ్చారు. తీరా పోలింగ్‌ సమయం దగ్గరపడగా, కొవిడ్‌ మహమ్మారి ఉధృతరూపం దాల్చడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ అప్పటికే జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ చక్రం తిప్పారు. టీడీపీ అభ్యర్థులను పలుచోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. అంగ, అర్థబలం ఉపయోగించి 1,086 ఎంపీటీసీ స్థానాలకు 82 చోట్ల ఏకగ్రీవాలు జరిపించుకున్నారు. తీరా ఎన్నిక వాయిదాతో పెట్టిన ఖర్చంతా ఎందుకూ కొరగాకుండా పోయిందని నెత్తీనోరు బాదుకున్నారు. తిరిగి అప్పట్లో వాయిదావేసిన ఎన్నికలను ఈ ఏడాది ఏప్రిల్‌ 8న నిర్వహించడానికి కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ విడుదలచేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పోలింగ్‌కు నాలుగువారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న నిబంధన పక్కనపెట్టారు. దీంతో ఎస్‌ఈసీ తీరును తప్పుబడుతూ ప్రతిపక్ష టీడీపీ జడ్పీ ఎన్నికలు బహిష్కరించింది. ఇదే అదనుగా అధికార పార్టీ ఏప్రిల్‌ 8న జరిగిన ఎన్నికల్లో చెలరేగిపోయింది. ఎక్కడికక్కడ మెజార్టీ స్థానాలు గెలవడం కోసం నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌ ఆశావహులు కోట్లలో డబ్బు వెదజల్లారు. పోలింగ్‌ ముందు రోజు మద్యం, చీరలు, నగదు, బహుమతులు యథేచ్ఛగా పంచారు. సుమారు రూ.40 కోట్ల వరకు ఖర్చుచేశారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నీలం సాహ్ని ఎన్నికలు జరిపించారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది మే21న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఏకంగా పరిషత్‌ ఎన్నికలను రద్దుచేశారు. దీంతో మరోసారి జడ్పీ ఫలితాలకు బ్రేక్‌ పడింది. అయితే ఇన్ని నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కేసు విచారించిన హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ గురువారం తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో అయిదు నెలల తర్వాత ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కోర్టు తీర్పు తర్వాత గురువారం సాయంత్రం స్ట్రాంగ్‌రూంల్లో బ్యాలెట్‌ పెట్టెలు పరిశీలించారు. కాగాఏప్రిల్‌ 8న జిల్లాలో 61 జడ్పీటీసీ, 1,000 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. దీంతో అప్పట్లో పోలింగ్‌ చప్పగా సాగగా 64.05 శాతానికి పడిపోయింది. జిల్లాలో 10.77 లక్షల మంది ఓటింగ్‌కు దూ రంగా ఉన్నారు. ఫలితాల వెల్లడికి ఇప్పుడు అనుమతి లభించిన నేపథ్యంలో అధికారులు కౌంటింగ్‌ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఆయా మండలాలకు సంబంధించిన లెక్కింపు చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కాకినాడ డివిజన్‌ పరిధిలోని ఓట్లను ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ (జీపీటీ), రంగరాయ మెడికల్‌ కాలేజీ, అమలాపురం డివిజన్‌ పరిధిలో లెక్కింపు అమలాపురంలోని బీవీసీ ఇంజనీరింగ్‌ కాలేజీ, అమలాపురం జడ్పీ హైస్కూల్లోను, రాజమహేంద్రవరం డివిజన్‌ కౌం టింగ్‌ ఎన్‌ఏసీ భవనంలోని మొదటి అంత స్తు, రామచంద్రపురం కౌంటింగ్‌ వీఎస్‌ఎం కాలేజీ, పెద్దాపురం డివిజన్‌ లెక్కింపు ఈటీసీ సామర్లకోట, వైటీసీ కాంప్లెక్స్‌, టీటీడీ బిల్డింగ్‌, ఏపీఎస్‌టీఏ సామర్లకోటలోను, రంపచోడవరం బీఎస్సార్‌ డిగ్రీకాలేజీ, ఎట పాక డివిజన్‌ కౌంటింగ్‌ ఎటపాకలోని ఏపీ ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్‌ కాలేజీలో చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపుతో ఎంపీటీసీ అభ్యర్థులు 2,620 మంది, 234 మంది జడ్పీటీసీ అభ్యర్థుల తలరాత తేలనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఎంపీటీసీలకు 17,90,158, జడ్పీటీసీలకు 19,23,295 ఓట్లు పోలయ్యా యి. అన్ని డివిజన్లకు కలిపి స్ట్రాంగ్‌రూమ్‌లు 61, కౌంటింగ్‌ కేంద్రాలు 12 ఏర్పాటుచేశారు. జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 303, ఎంపీటీసీలకు 315 కౌంటింగ్‌ టేబుళ్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తం టేబుల్‌ సూపర్‌వైజర్లు 728, టేబుల్‌ అసిస్టెంట్లు 2,447, 200 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తారు.