Abn logo
Sep 24 2021 @ 22:49PM

మండల పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం ప్రశాంతం

కావలి ఎంపీపీ ఆలూరు కొండమ్మను అభినందిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి

కావలి రూరల్‌, సెప్టెంబరు 24: కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో మండల పరిషత్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. కావలి మండల పరిషత్‌ కార్యాలయంలో మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీంద్ర ఆధ్వర్యంలో  మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎంపీపీగాచలంచర్ల పంచాయతీ ఎంపీటీసీ ఆలూరు కొండమ్మ, వైస్‌ ఎంపీపీగా తుమ్మలపెంట బిట్‌-1 ఎంపీటీసీ పామంజి రాజయ్య, కో ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ ఖలీల్‌బాషా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన ఎమ్పీటీసీ సభ్యులను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి అభినందించారు. అనంతరం పాలకవర్గ సభ్యులను అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాళెం ఎంపీటీసీ అరగల కవిత, పెదపట్టపుపాలెం ఎంపీటీసీ గంగన్నగారి యాదగిరి, చెన్నాయపాలెం ఎంపీటీసీ మానం విజయ నిర్మల, తుమ్మలపెంట బిట్‌-2 ఎంపీటీసీ కొండూరు పెద్ద మునెమ్మ, అన్నగారిపాలెం బిట్‌-2 ఎంపీటీసీ ప్రళయకావేరి శ్రీనివాసులు, అన్నగారిపాలెం బిట్‌-1 ఎంపీటీసీ పొన్నాడి సూలం, ఎమ్పీడీవో సుబ్బారావు, జడ్పీటీసీ జంపాని రాఘవులు, సిరిపురం సర్పంచు జక్కంపూడి రమేష్‌ బాబు, నాయకులు సన్నిబోయిన ప్రసాద్‌, ఆలూరు శంకరయ్య, నాయుడు రాంప్రసాద్‌, వల్లూరి దయాకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే

బిట్రగుంట, సెప్టెంబరు 24: నవరత్నాల పఽథకాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజా, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని కావలి ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీపీగా మేకల సుజాత, ఉపాధ్యక్షురాలిగా మద్దిబోయిన పద్మ, కోఆప్షన్‌ సభ్యుడిగా నాయిబ్‌ రసూల్‌ను ఎంపిక చేశారు. అనంతరం ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. ఎంపీడీతో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫ్కాప్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు, కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, జిల్లా యువనాయకుడు రూప్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ సులోచనమ్మ,  వైసీపీ మండల కన్వీనర్‌ వీరరఘు, యువత అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, నూతనంగా జడ్పీటీసీ కీర్తన, ఎంపీటీసీలు, సీఐ ఖాజావలి, సర్పంచి అనిత, స్థానిక నేతలు పెంచలయ్య, సురేంద్రరెడ్డి, మాచర్ల, సురేష్‌, సమీఉల్లా, తదితరులు పాల్గొన్నారు.   

కలిగిరి ఎంపీపీ పీఠం ‘మెట్టుకూరు’దే!

కలిగిరి, సెప్టెంబరు 24: ఉత్కంఠ భరితం సిఫారసులు, ఎత్తుకు పైఎత్తులు, క్యాంపు రాజకీయాలు, ఇలా అనేక నాటకీయ పరిణామాల మధ్య కలిగిరి ఎంపీపీ పీఠాన్ని ‘మెట్టుకూరు’ వారే చేజిక్కించుకున్నారు. 11 ఎంపీటీసీల బహిరంగ మద్దతుతో కాకాణి వద్ద బలప్రదర్శన చేయడంతోపాటు, స్వయానా ఎమ్మెల్యే మేకపాటి చేతులమీదుగా బీఫారం అందుకుని, ఏకగ్రీవంగా కలిగిరి మండలాధ్యక్షరాలిగా మెట్టూకూరు శిరీష, ఉపాధ్యక్షురాలిగా పొన్నం రాజ్యలక్మి ప్రమాణ స్వీకారం చేశారు. అన్నీ తానై తనసతీమణి వెన్నంటి ఉండి ఏపీ రాష్ట్రపోలీస్‌ హౌసింగ్‌ కమిటీ చైర్మన్‌ చిరంజీవిరెడ్డి ఆధ్యంతం కార్యక్రమాన్ని తన చేతులమీదుగా నిర్వహింపజేశారు. కలిగిరి మండలం నుండే కాకుండా ఇతరప్రాంతాల నుండి చిరంజీవిరెడ్డి అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 24: స్థానిక స్త్రీశక్తి భవనంలో శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల అధికారి అరుణప్రసాద్‌, సహాయ ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు తొలుత మండల కో-ఆప్షన్‌ సభ్యుని ఎంపికకు నామినేషన్లు స్వీకరించారు. కో-ఆప్షన్‌ సభ్యత్వానికి షేక్‌ సుభానీ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో అతన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఎంపీటీసీ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా మూలె పద్మజ, వైస్‌ ఎంపీపీగా గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి పేర్లను పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించి బీ-ఫారం అందజేసి విప్‌ జారీ చేసింది. ఎంపీటీసీలు ఎవరూ అభ్యంతరం తెలపకపోవడంతో అధికారులు వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ఎంపికైన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యుడు, ఎంపీటీసీలను నాయకులు, కార్యకర్తలు, బంధువులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏవో రేణుకా, సొసైటీ అధ్యక్షులు మూలె వినయ్‌రెడ్డి, నాయకులు మూలె సుబ్బారెడ్డి, వెంగళరెడ్డి, ఓబులరెడ్డి, కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

దుత్తలూరు : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్‌ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయకుమార్‌ తొలుత కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మౌలాలీతో, అనంతరం ఎంపీటీసీ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా చేజర్ల జయంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీగా మీసాల రమాదేవి పేర్లను పార్టీ అధిష్టానం ప్రతిపాదించి బీ-ఫారం అందజేసి విప్‌ జారీ చేసింది. ఎంపీటీసీ పార్టీ ప్రతిపాదించిన వారినే ఆమోదించడంతో వారినే ఎంపిక చేసి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమే్‌షమోహన్‌బాబు, సొసైటీ అధ్యక్షులు చేజర్ల చలమారెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీకాంతమ్మ, మండల వైసీపీ కన్వీనర్‌ వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. 

జలదంకి, సెప్టెంబరు 24: మండల పరిషత్‌లో జరిగిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఎంపీపీగా జమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యుడు గోచిపాతల వెంకటరమణయ్య, ఉపాధ్యక్షుడుగా అన్నవరం-1 ఎంపీటీసీ సభ్యుడు పాలవల్లి మాలకొండారెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడిగా జమ్మలపాలెంకు చెందిన దేవరపల్లి శ్రీనివాసులును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి రవికుమార్‌ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సాయంత్రం 3గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరగ్గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన వారిని ఎంపీడీవో భాస్కర్‌, వైసీపీ మండల కన్వీనర్‌ దగుమాటి మాల్యాద్రిరెడ్డి, జడ్పీటీసీ మేదరమెట్ల శివలీల, సొసైటీ ఛైర్మన్‌ కేతిరెడ్డి రవిరెడ్డి తదితరులు అబినందించారు. 

అల్లూరు, సెప్టెంబరు 24 : అల్లూరు మండల ఎంపీపీగా దర్శిగుంట శశిరేఖ, ఉపాధ్యక్షుడిగా బీరంగుంట ఎంపీటీసీ గుమ్మడి సురేంద్ర, కోఆప్షన్‌ సభ్యుడిగా పురిణికి చెందిన షేక్‌ కరీంసాహెబ్‌ను ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, నంతరం ఎంపీపీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.బాలాజీనయక్‌ ఆధ్వర్యంలో ఎంపీడీవో నగే్‌షకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురిణి ఎంపీటీసీ సయ్యద్‌ దిలీప్‌, గ్రద్దగుంట ఎంపీటీసీచెముకుల చెంగయ్య, స్థానిక వైసీపీ నాయకులు దండా కృష్ణారెడ్డి, బీద రమే్‌షబాబు, నీలం సాయికుమార్‌లతోపాటు పలువురు బాణాసంచా కాల్చి వారి అభిమానాన్ని చాటారు. 

సీతారామపురం, సెప్టెంబరు 24 : సీతారామపురం మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా బసినేనిపల్లి ఎంపీటీసీ చింతంరెడ్డి పద్మావతి, ఉపాధ్యక్షురాలిగా నెమళ్లదిన్నె ఎంపీటీసీ నేలటూరి సారమ్మ, కో ఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ హైదర్‌ఆలీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రమే్‌షబాబు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుడితోపాటు, మిగిలిన ఎంపీటీసీలు అందరితో శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌  పాల్గొన్నారు.

కొండాపురం, సెప్టెంబరు 24: మండల ఎంపీపీగా నేకునాంపేట ఎంపీటీసీ బొడ్డు అనూరాధను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి సుభానీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి ఆదేశాల మేరకు బొడ్డు అనూరాధను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా కొమ్మి ఎంపీటీసీ బండ్లమూడి నాగేంద్రమ్మను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోఆప్షన్‌ సభ్యుడిగా గరిమెనపెంట పంచాయతీకి చెందిన షేక్‌ మహమ్మద్‌ అనీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీగా ఎంపికయిన యల్లావుల వెంకటరావు, ఎంపీపీ అనూరాధతోపాటు సభ్యులందరినీ అధికారులు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో ఎం.బ్రహ్మయ్య, తహసీల్దార్‌ రమణారావు, ఈవోపీఆర్‌డీ విజయ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

వరికుంటపాడులో ఉత్కంఠం

వరికుంటపాడు, సెప్టెంబరు 24: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ఆద్యాంతం ఉత్కంఠంగా సాగింది. మండల ఎంపీపీ పీఠం ఓసీ జనరల్‌కు కేటాయించడంతో ఉదయగిరి ఏఎంసీ చైర్మన్‌ షేక్‌.అలీఅహమ్మద్‌ తన అనుచరులైన బీసీ వర్గానికి చెందిన రామాపురం ఎంపీటీసీ గవదకట్ల వెంకటలక్ష్మమ్మను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే తరుణంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని హంగులు ఏర్పాటు చేసుకున్నారు. కార్యాలయ ఆవరణతో పాటు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పత్రికల్లోను అభిమానులు ప్రకటనలు గుప్పించారు. అదే ఉత్సాహంతో కార్యాలయం వద్దకు పరుగులు తీసిన కార్యక్తలకు నిరాశే మిగిలింది. అదే ఎంపీపీ స్థానం కోసం గణేశ్వరాపురం ఎంపీటీసీ సింగమరెడ్డి వెంకటసుజన శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నుంచి బీఫారం అందుకుని రంగంలోకి దిగింది. దీంతో విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు విస్తుపోయారు. తొలినుంచి ప్రకటిస్తూ వచ్చిన అభ్యర్థిని కాదని మరో అభ్యర్థికి మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమంటూ అధికార పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు వెలిశాయి. ఉదయం కార్యాలయం వద్దకు పరుగులు తీసిన నాయకులు, కార్యకర్తలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోవడంతో అధికార పార్టీలో ఇక వర్గ విభేదాలు బహిర్గత మయ్యే పరిస్ధితి నెలకొన్నంది. కార్యాలయంలో కేవలం బీఫారం పొందిన అభ్యర్థితో పాటు ప్రతిపాదించే మరో సభ్యుడు ఉండడంతో ఇక ఆమెకే పదవి వరించిందనే ప్రచారం సైతం జోరుగా సాగింది. అయితే మధ్యాహ్నం 12:45 గంటలకు ఒక్కసారిగా ఏఎంసీ చైర్మన్‌కు చెందిన వాహనంలో ఆరుగురు ఎంపీటీసీలు కార్యాలయానికి చేరుకున్నారు. అయినప్పటికీ విరువూరు ఎంపీటీసీ 3 గంటల వరకు చేరుకోకపోవడంతో ఆమె కోసం ఆతృతగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ప్రజలు భారీస్థాయిలో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆపై ఆర్వో రమేష్‌, ఏఆర్వో సురేష్‌బాబులు ఎన్నిక పక్రియ కొనసాగించారు. తొలుత బీఫారం పొందిన అభ్యర్థిని జి.కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ మధు ప్రతిపాదించినప్పటికీ బలపరిచేవారు లేకుండా పోయారు. అనంతరం రామాపురం ఎంపీటీసీని వరికుంటపాడు ఎంపీటీసీ ప్రతిపాదించగా పెద్దిరెడ్డిపల్లి ఎంపీటీసీ బొల్లా ఆదిలక్ష్మమ్మ బలపరిచగా ఆరు ఓట్ల మెజారిటీతో ఆమె ఎన్నికయ్యారు. వారితో పాటు వైస్‌ ఎంపీపీగా వరికుంటపాడు ఎంపీటీసీ చంచలమధు, కో ఆప్షన్‌ సభ్యులుగా తిమ్మారెడ్డిపల్లికిచెందిన షేక్‌. జిలానీబాషాలతో ప్రమాణస్వీకారం చేయించి నియామక పత్రాలు అందచేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఎంపీటీసీ ఎన్నికల్లో గతంలో లేని విధంగా తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నాం. ప్రస్తుత ఎంపీపీ ఎన్నిక సైతం ఎమ్మెల్యే మేకపాటి సహకారంతో ప్రశాంతంగా జరిగింది. ఈ విజయాన్ని ఆయనకే అంకితం చేస్తున్నామని ఏఎంసీ చైర్మన్‌ అన్నారు.ఉదయగిరి ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న మూలె పద్మజ


కలిగిరి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న మెట్టుకూరు శిరీష