కష్టం మాది.. సత్కారం వారికా..?

ABN , First Publish Date - 2021-04-16T06:33:23+05:30 IST

జిల్లా ఉన్నతాధికారుల తీరుపై ఎంపీడీవోలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కష్టం మాది.. సత్కారం వారికా..?

  1. ఉన్నతాధికారుల తీరుపై ఎంపీడీవోల అసంతృప్తి
  2. పని ఒత్తిడి తగ్గించాలని జడ్పీ సీఈవోకు వినతి


కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 14: జిల్లా ఉన్నతాధికారుల తీరుపై ఎంపీడీవోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత కష్టపడి పనిచేసినా సమీక్షల్లో తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు కష్టపడి పనులు చేస్తే.. రెవెన్యూ శాఖవారిని సత్కరిస్తున్నారని జడ్పీ సీఈవో వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నేతృత్వంలో జడ్పీ సీఈవో ఎం. వెంకటసుబ్బయ్య, డిప్యూటీ సీఈవో టీవీ భాస్కర్‌నాయుడుని గురువారం కలిశారు. ప్రతి గ్రామంలో జరిగే పనులకు ఎంపీడీవోలనే బాధ్యులను చేసి టెలి కాన్ఫరెన్సులలో ఉన్నతాధికారులు అవమానిస్తున్నారని అన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఎంపీడీవోలు సొంత డబ్బుతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారని, బాధితులకు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. వాటికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో కొవిడ్‌ పరీక్షలను ఎంపీడీవోలు చేయిస్తున్నారని, కానీ టెలి కాన్ఫరెన్సులలో ఎంపీడీవోలు ఏమీ చేయడం లేదని ఉన్నతాధికారులు అవమానకరంగా మాట్లాడటం భావ్యం కాదని అన్నారు. గత ఏడాది జరిగిన పుష్కరాల్లో జిల్లాలోని అన్ని ఘాట్లలో శానిటైజేషన్‌, నీటిసరఫరా తదతర కార్యక్రమాలను  పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చేశారని, కానీ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు సన్మానాలు చేసి వారిని అభినందించారని గుర్తు చేశారు. ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉత్సవ్‌కు తహసీల్దార్లు చైర్మన్లు కాగా, వైఫల్యాలకు ఎంపీడీవోలను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమో కలెక్టర్‌ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మండలాల్లో ఏ పనినైనా అందరూ కలిసి చేయాలని కలెక్టర్‌ చెబుతుండటంతో తాము ముందుకు వస్తున్నామని, అది తమ పని కాకపోయినా వైఫల్యాలను అంటగట్టడం సరికాదని సీఈవోతో అన్నారు. తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీడీవోలు సీఈఓను కోరారు. ఎంపీడీవోలపై పని ఒత్తిడిని తగ్గించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు రాముడు, శివనాగప్రసాద్‌, మాధవీలత, నాగశేషాచలరెడ్డి, ఫజుల్‌ బాషా, చంద్రశేఖర్‌, సుబ్బారెడ్డి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T06:33:23+05:30 IST