మొక్కుబడిగా ‘ఉపాధి’ ప్రజావేదిక

ABN , First Publish Date - 2022-01-29T03:39:41+05:30 IST

మండలంలో 13, 14 విడతల్లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక మొక్కుబడిగా జరిగింది.

మొక్కుబడిగా ‘ఉపాధి’ ప్రజావేదిక
ప్రజావేదికలో పనుల నివేదిక పరిశీలిస్తున్న అధికారులు

రూ.6.75 లక్షల రికవరీకి ఆదేశం

అల్లూరు, జనవరి 28 : మండలంలో 13, 14 విడతల్లో జరిగిన ఉపాధి హామీ పథకం  పనులపై శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక మొక్కుబడిగా జరిగింది. అయితే నివేదికలను పరిశీలించిన అధికారులు రూ.6,74,892 రికవరికీ ఆదేశించారు. ఈనెల 21 నుంచి 27 వరకు క్షేత్రస్థాయిలో  పనులు పరిశీలించిన అధికారుల బృందం ఆ నివేదికను ప్రజావేదిక ద్వారా డ్వామా ఏపీడీ, ప్రొసీడింగ్‌ అధికారి శ్రీహరిరెడ్డి, ఎంపీడీవో నగే్‌షకుమారిల దృష్టికి తీసుకొచ్చారు. ఆ నివేదికలను పరిశీలించిన అధికారులు అన్ని శాఖల పరిధిలో నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. కాగా ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది మినహా ఎవ్వరూ పాల్గొనకపోవడం గమనార్హం. కనీసం మైక్‌ను వినియోగించి పరిశీలించిన పనుల వివరాలు, తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించకనే వచ్చిన అధికారులు, సిబ్బంది వారిలో వారే చర్చించుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఇంతటి దానికి ఈ కార్యక్రమం నిర్వహించి ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ అధికారులు వేణుగోపాల్‌, వెంకటరెడ్డి, మధు, భాస్కర్‌, ఎంపీపీ దర్శిగుంట శశిరేఖ, ఉపాధ్యక్షుడు గుమ్మడి సురేంద్ర, పీఆర్‌ ఏఈ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T03:39:41+05:30 IST