Abn logo
Mar 1 2021 @ 14:57PM

హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన విజయసాయి

ఇంటర్నెట్ డెస్క్: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 40వ వార్డు అభ్యర్థి గుండపు నాగేశ్వర రావు, 63వ వార్డు అభ్యర్థి పిలకా రామ్మోహన్ రెడ్డిల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఒక బైక్‌పై రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, మరో బైక్‌పై విజయసాయి ఉన్నారు. కానీ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోకపోవడం విశేషం. అంతేకాకుండా మాస్క్ కూడా పెట్టుకోకుండా కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. బాధ్యతగల పదవుల్లో ఉండి... హెల్మెట్ ధరించకుండా బుల్లెట్ నడపటంతో పాటు కోవిడ్ నిబంధనలు అతిక్రమించడంతో ఇరువురు నేతలు విమర్శలకు గురవుతున్నారు. ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వమే భారీ జరిమానాలు విధిస్తుంటే... మరోపక్క ఆ ప్రభుత్వంలోని వారే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.1000 జరిమానా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టు వెనక ఉన్నవారూ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు స్వయంగా విజయసాయి రెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం గమనార్హం.


Advertisement
Advertisement
Advertisement