Raghurama కృష్ణంరాజు ప్రకటనతో.. YCPలో గుబులు..!

ABN , First Publish Date - 2022-01-18T18:02:09+05:30 IST

Raghurama కృష్ణంరాజు ప్రకటనతో.. YCPలో గుబులు..!

Raghurama కృష్ణంరాజు ప్రకటనతో.. YCPలో గుబులు..!

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన రాజీనామా ప్రకటన నరసాపురం వైసీపీలో కలకలం రేపుతోందా? నిజంగానే రఘురామ రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు వెళితే తమ పరిస్థితి ఏమిటని అధికార పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారా? పార్టీలో పక్కలో బల్లెంలా మారిన ఎంపీ రఘురామ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానంటే..  సంతోషించాల్సిన వైసీపీ నేతలు ఎందుకు కలవర పడుతున్నారు? వారి సందేహాలకు అసలు కారణాలేమిటి? వివరాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


పాశుపతాస్త్రం ఎక్కుపెట్టిన రెబల్‌ నేత

రఘురామకృష్ణంరాజు.. రాజకీయంగా పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న ఎంపీ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి తాను గెలుపొందిన పార్టీ విధానాలపైనే పాశుపతాస్త్రం ఎక్కుపెట్టిన రెబల్‌ నేత. తాజాగా ఈయన చేసిన రాజీనామా ప్రకటన రాజకీయ వర్గాల్లో కాస్తంత కలకలం సృష్టించింది. ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో అయితే తీవ్ర కలవరాన్ని రేకెత్తించింది. నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత కాలంలో ఒక్కసారిగా గళం విప్పారు.


రాష్ట్రంలో అధికారంలో ఉన్న సొంత పార్టీ వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం మొదలుపెట్టారు. తాను పార్టీకి వ్యతిరేకం కాదంటూనే, ప్రభుత్వ పరిపాలనా తీరుపై విల్లు ఎక్కుపెట్టారు. ఆ పరిణామాలతో విస్తుపోయిన వైసీపీ నేతలు ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టారు. రఘురామ వేరే పార్టీలకు కోవర్ట్ అంటూ విమర్శలు ప్రారంభించారు. ఈ పరిణామాలు ఏ మాత్రం రఘురామ కృష్ణంరాజుపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అంతేకాక నరసాపురం పార్లమెంటు పరిధిలోని తన పార్టీ ఎమ్మెల్యేల అవినీతి విధానాలపైనా ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మింగుడుపడని నరసాపురం లోక్‌సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనపై పోలీస్‌ కేసులు పెట్టించారు. 


అధికార వైపీపీలో మాత్రం తీవ్ర కలకలం 

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంపీ రఘురామ తీరును తీవ్రంగా పరిగణించింది. హైదరాబాద్‌లో ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేయించింది. వైసీపీ ఎంపీలతో లోక్‌సభ స్పీకర్‌కు లెటర్లు పెట్టించి... రఘురామ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయించాలని చూసింది. ఈ విధంగానైనా రఘురామ కృష్ణంరాజు లొంగుతారని అనుకున్న రాష్ట్ర వైసీపీ సర్కారుకు చుక్కెదురైంది. తన అరెస్టుతో మండిపోయిన ఆయన.. తన దూకుడును మరింత పెంచారు. ఈ పరిణామాలు కొనసాగుతున్న క్రమంలోనే ఎంపీ రఘురామ సంచలన ప్రకటన చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అమరావతే రాజధాని ఎజెండాగా ఉప ఎన్నికలకు వెళతానని వెల్లడించారు. ఈ ప్రకటన ఇతర రాజకీయ పార్టీల్లో ఎలా ఉన్నా... అధికార వైపీపీలో మాత్రం తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన ప్రకటనపై పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని చేయలేకపోతున్నారు. ఎవరైనా వైసీపీ పెద్దలు స్పందించినా.. ఆచితూచి మాట్లాడుతున్నారే కానీ, ఆయన రాజీనామా వల్ల వచ్చే ఉపఎన్నికను దీటుగా ఎదుర్కొంటామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.


బీజేపీ అండతోనే రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం

రఘురామ చేసిన రాజీనామా ప్రకటనపై వైసీపీ వర్గాలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. పొరుగునే ఉన్న తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణాలో ఇటీవల జరిగిన కొన్ని ఉపఎన్నికల్లో బీజేపీ  ఘన విజయం సాధించింది. అక్కడ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎంత దూకుడుగా వెళ్లినా, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నరసాపురంలో కూడా అదే పరిస్థితి రావొచ్చనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే- రఘురామకృష్ణంరాజు కేంద్రంలోని బీజేపీ అండతోనే రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. ఉప ఎన్నికల బరిలో ఏదైనా పార్టీ తరఫున రఘురామ పోటీ చేసినా, లేక వ్యక్తిగతంగా బరిలోకి దిగినా.. ఆయనకు బీజేపీ అండదండలు ఉంటాయనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. 


తమ అభ్యర్ధి పోటీ చేస్తే నెగ్గుకు రాగలడా?

ఇక రఘురామకృష్ణంరాజుకు రాష్ట్రంలోని కొన్ని పార్టీల నుంచి మద్దతు కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది వైసీపీ వర్గాల వాదన. అంతేకాదు, రఘురామ ఆర్ధికంగా బలమైన నేత. సొంత క్యాడర్ ఉంది. నరసాపురం నియోజకవర్గంలో ఈయనకు భారీ అభిమానగణం అండ ఉంది. వీటన్నింటిని తట్టుకుని తాము పోటీకి దిగగలమా? అనే సంశయం వైసీపీ వర్గాల్లో మొదలైంది. మరీ ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేకతను తీవ్ర స్థాయిలోనే మూటగట్టుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి. ఇన్నీ వ్యతిరేకతల మధ్య తమ అభ్యర్ధి పోటీ చేస్తే నెగ్గుకు రాగలడా? అనే డైలమా అధికార పార్టీ నేతల్లో నెలకొంది. 


ఆయన రాజీనామా చేసిన తర్వాత కదా! అసలు కథకు తెరలేచేది

మరోవైపు నరసాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగా రఘురామ రాజీనామా ప్రకటనపై మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే- వీరంతా ఎన్నికల సమయంలో ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం పొందినవారేనట. ఈ పరిస్థితుల్లో ఉపఎన్నిక వస్తే... తాము ఏ విధంగా స్పందించాలో తెలియని స్థితిలో ఆ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో"అప్పుడే కంగారు పడటం ఎందుకు? చూద్దాం ఏమవుతుందో..! ఆయన రాజీనామా చేసిన తర్వాత కదా! అసలు కథకు తెరలేచేది..." అనే అభిప్రాయంలో  మరికొందరు నేతలు ఉన్నారు. మొత్తంమీద వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన బౌన్సర్‌.. ఎటు తిరుగుతుందో చూడాలి.

Updated Date - 2022-01-18T18:02:09+05:30 IST