జగన్‌ ఉండగా.. రాలేనేమో!

ABN , First Publish Date - 2022-07-05T08:11:56+05:30 IST

ఉన్మాది జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఏపీకి వస్తానని అనుకోవడం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్‌ వచ్చి,

జగన్‌ ఉండగా.. రాలేనేమో!

ఏపీ పోలీసుల అదుపులో నా అభిమానులు

వారి చిత్రహింసలపై వరుసగా ఫోన్లు

అందుకే మోదీ సభకు వెళ్లకుండా వెనుదిరిగా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడి


న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి):  ఉన్మాది జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఏపీకి వస్తానని అనుకోవడం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్‌ వచ్చి, పోలీసులు సీఎం అదుపు ఆజ్ఞల్లో లేనప్పుడే తాను రాష్ట్రంలో అడుగుపెట్టగలనని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అల్లూరి  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను  పాల్గొనకపోవడానికి కారణాన్ని వివరించారు. ఆహ్వానితుల జాబితాలో స్థానిక ఎంపీగా తన పేరు లేకపోవడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తనను అభిమానించి, ప్రేమించే ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎంపీని ఏమీ చేయం. కానీ మిమ్మల్ని ఉతికేస్తాం అని నా అభిమానులను పోలీసులు బెదిరించారు. చదువుకొనే తన ఇద్దరు కుమారులను పోలీసులు కారులో ఎక్కడికో తీసుకువెళ్లిపోయినట్టు వారి తండ్రి నాకు ఫోన్‌ చేసి వాపోయారు.


పోలీసులు పెడుతున్న ఇబ్బందులను ఒక్కొక్కరుగా ఫోన్‌ చేసి చెబుతుండటంతో ఏంచేయాలో పాలుపోక ప్రధాని సభకు  హాజరుకాకుండా వెనుదిరిగా’ అని వివరించారు.  దేశంలో ఒక ఎంపీ బతకడానికి కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  అల్లూరి సభలో తాను పాల్గొనకూడదంటూ జగన్‌ పత్రికకు చెందిన కొందరు పెయిడ్‌ కళాకారులు ఆందోళన చేశారని, దీనిపై పీఎంవోకు నివేదిస్తానని చెప్పారు.  ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై పది సార్లు లేఖలు రాశాననీ, అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పారు. పార్లమెంటరీ లా జస్టిస్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ సభ్యుడినైన తనకే అన్యాయం జరిగిందన్నారు. పరిటాల రవి, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యల్లోనూ పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌గా చెప్పుకున్న ఒక వ్యక్తిని సోమవారం తన ఇంటి వద్ద సీఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని, గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఐడీ కార్డు తెచ్చుకోలేదని ఆ వ్యక్తి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని,  తన హత్యకూ పోలీసుల్ని వాడుతున్నారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి జీన్స్‌లోనే క్రిమినల్‌ మనస్తత్వం ఉందని రఘురామ ఆరోపించారు. విజయసాయి తండ్రి సుందర రామిరెడ్డి 1945లోనే తాళ్లపూడి గ్రామంలో సొంత సోదరుడిని, మరొక సోదరునితో కలిసి హత్య చేశారని, ఈ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని తెలిపారు. మైనర్‌ అయిన సుందరరామిరెడ్డి జైల్లోనే విద్యాభ్యాసం చేశారన్నారు.

Updated Date - 2022-07-05T08:11:56+05:30 IST