సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

ABN , First Publish Date - 2021-06-17T15:35:48+05:30 IST

ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు వరుసగా ఎనిమిదవ లేఖ రాశారు.

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు వరుసగా ఎనిమిదవ లేఖ రాశారు. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు - పేదలందరికి ఇల్లు పథకాన్ని అమలు చేసి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎంపీ కోరారు. ఇల్లు లేని వారికి 25 లక్షల ఇళ్లు ఇస్తా అని పాలకొల్లు ఎన్నికల సభలో తన సమక్షంలోనే హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. కొమరగిరిలో పైలాన్‌ ఆవిష్కరించి 30.6 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఎవైతో అనుసంధానించి అమలు చేయనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. గత ఏడాది జూన్ 16న గృహనిర్మాణ పథకానికి రూ. 3,691.79 కోట్లు మంజూరు చేసి.. 2021 లో ఓటు-ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్‌లో బడ్జెట్ కేటాయింపులను ఇచ్చిందని తెలిపారు. 17వేల హౌసింగ్‌ కాలనీలు నిర్మించడానికి 50వేల కోట్లకు పైగా అవసరం అని ముందే తెలిసినప్పుడు.. బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఎలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఎంపీ అన్నారు. 30 లక్షల ఇళ్లు నిర్మాణానికి 70 వేల కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు.. ఏటా ఐదు వేల కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తే.. ఎప్పటికి పూర్తవుతాయి, ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎంపీ రఘురామ లేఖలో ప్రశ్నించారు.

Updated Date - 2021-06-17T15:35:48+05:30 IST