ఆ దొంగల వల్లే ప్రభుత్వానికి అప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-08-12T09:35:03+05:30 IST

‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ మనసు దోచుకునే కొందరు దొంగలు ఇచ్చే తప్పుడు సలహాలవల్లే మన

ఆ దొంగల వల్లే ప్రభుత్వానికి అప్రతిష్ఠ

  • మీ మనసు దోచుకుని.. మెప్పు యత్నాలు
  • విశాఖ ప్రజలు రాజధాని వద్దంటున్నారు
  • ముందు కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి సార్‌
  • సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సూచనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగారూ.. మీ మనసు దోచుకునే కొందరు దొంగలు ఇచ్చే తప్పుడు సలహాలవల్లే మన ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. కొందరు భజనపరులు తమ స్వప్రయోజనాలకోసం మీ మెప్పు పొందేందుకు అనాలోచిత సలహాలు ఇస్తున్నారు. వారి మాటలు విని, రాజ్యాంగ, చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంవల్లే న్యాయస్థానాల్లో మనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల్లో చులకన అయిపోతున్నాం. ఈ వాస్తవాలను గమనించండి’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు సూచించారు.


ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ పునర్విభజన చట్టానికి భిన్నంగా మూడు రాజధానులు ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎంపీ తెలిపారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని అక్కడి ప్రజలు, రైతులు కోరుతున్నారని, విశాఖపట్నంలో రాజధాని అవసరం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారని ఎంపీ తెలిపారు. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులెందుకన్న బీజేపీ నేత రామ్‌మాధవ్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. 


డాక్టర్‌ రమేశ్‌’కు కులం కార్డు సరికాదు

విజయవాడలోని కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎంపీ రఘురామ అన్నారు. అలాగని  ఆస్పత్రిని నిర్వహిస్తున్న చైర్మన్‌ డాక్టర్‌ రమేశ్‌కు కులం కార్డు అంటగట్టి, ఆయన పేరులో చౌదరి లేకపోయినా ‘రమేశ్‌ చౌదరి’ అని సంబోధించడం మంచిదికాదని అన్నారు. 

Updated Date - 2020-08-12T09:35:03+05:30 IST