‘ఊ అంటావా రెడ్డీ ఉ..ఊ అంటావా రెడ్డీ’... హైకోర్టు తీర్పుపై ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-03-03T20:04:01+05:30 IST

రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు.

‘ఊ అంటావా రెడ్డీ ఉ..ఊ అంటావా రెడ్డీ’... హైకోర్టు తీర్పుపై ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు తీర్పును ఎంపీ స్వాగతించారు. అమరావతి తీర్పు సందర్భంగా ఢిల్లీలోని నివాసంలో సిబ్బందికి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... అమరావతి అంశంలో హైకోర్టు సెన్సేషనల్ తీర్పు ఇచ్చిందన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జనసేన పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి, బీజేపీ, ప్రతీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. తక్కువ ఖర్చుతో మంచి కాపిటల్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. అమరావతి రాజధాని అంశంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. 


అమరావతిని కొంచం కూడా కదపలేరని ముందే చెప్పానన్నారు. సీఆర్డీఏ చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. మనోవేదనతో మరణించిన రైతుల హత్యలు అన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంకా దెబ్బలు పడతాయని హెచ్చరించారు. ‘‘ఊ అంటావా రెడ్డీ ఉ..ఊ అంటావా రెడ్డీ.. ఉ అంటే రైతులు డేరాల నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే అదే డేరాలో రైతులుంటారు’’ అని ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ‘‘అప్పు చేస్తారా లేక... కేంద్రాన్ని బ్రతిమలుతారా అమరావతిలో అభివృద్ధి చేయాలి.. నేను ముఖ్యమంత్రి పదవి చేయలేను అనుకుంటే వదిలి వెళ్లిపోతారా మీరే ఆలోచించుకోండి’’ అని తెలిపారు. ఎప్పుడు మాట్లాడే సజ్జల, బొత్స సత్యనారాయణ సమన్వయం పాటించారన్నారు. అనవసరంగా కోర్టులను తప్పుదోవ పట్టడం, వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. 


‘‘వివేకానందరెడ్డి హత్యలో ఇద్దరే ఉన్నారని అంటున్నారని.. సాక్షిలో సునీత రెడ్డి, ఆమె భర్త అంటున్నారు?.. గుండెపోటుతో చనిపోయారని ఉదయాన్నే చెప్పింది ఎవరు?... అసలు గుండెపోటు కథనం ఎందుకు నడిపారని ప్రజలు అనుకుంటున్నారు... సీబీఐ విచారణ చేస్తోంది, వారి పని వాళ్లు చేస్తున్నారు’’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-03T20:04:01+05:30 IST