రాష్ట్రంలో ఆర్థిక అంధకారం!

ABN , First Publish Date - 2022-05-20T08:13:03+05:30 IST

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాజ్యాంగ విరుద్ధంగా రాష్ర్టానికి అప్పులిస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామరాజు రిజర్వు బ్యాంకుకు..

రాష్ట్రంలో ఆర్థిక అంధకారం!

  • రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు
  • ‘సూట్‌కేస్‌’ కార్పొరేషన్లతో మాయ
  • సహకరిస్తున్న యూబీఐ, బీవోబీ
  • ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోండి
  • ఆర్బీఐకి ఎంపీ రఘురామ ఫిర్యాదు


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాజ్యాంగ విరుద్ధంగా రాష్ర్టానికి అప్పులిస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామరాజు రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ‘ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌’ పేరుతో రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ఇది ఆర్టికల్‌ 293(3)కి విరుద్ధమని చెప్పారు. గురువారం దీనిపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌కు సుదీర్ఘ ఫిర్యాదు చేశారు. ‘‘ఆర్టికల్‌  293(3) ప్రకారం కేంద్రం అనుమతించిన అప్పులను మాత్రమే చేయాలి. కానీ... దొడ్డి దారిన, ఖజానా ఆదాయాన్ని సూట్‌కేసు కార్పొరేషన్లకు మళ్లిస్తూ వేలకోట్ల అప్పులు తెస్తున్నారు. ఇలా తెచ్చిన అప్పులను బడ్జెట్‌ పుస్తకాల్లో చూపకుండా, మళ్లీ కొత్త అప్పులకు ఎగబడుతూ రాష్ర్టాన్ని ఆర్థికంగా  పాతాళంలోకి నెట్టేస్తున్నారు’’ అని రఘురామ కృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం లెక్కల్లో, పుస్తకాల్లో చూపకపోయినా ఆ అప్పులు కట్టక తప్పదని, ఆ భారమంతా రాష్ట్ర ఖజానాపైనే పడుతుందని చెప్పారు. అప్పులు తెచ్చుకున్న ‘సూట్‌కేస్‌’ కార్పొరేషన్లకు పైసా ఆదాయం లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక అంధకారం ఏర్పడిందని వివరించారు. 


ఆ రెండు బ్యాంకులు...

జగన్‌ సర్కార్‌ మూడేళ్లుగా కొనసాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని రఘురామ రాజు తెలిపారు. ‘‘అక్రమం,  రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా రాష్ర్టానికి వేలకోట్ల అప్పులిచ్చేందుకు  ఆ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్యారెంటీలు చూసి కార్పొరేషన్లకు అప్పులివ్వకూడదని ఆర్‌బీఐ ఆదేశించింది. దీంతో... దొడ్డిదారిని కనిపెట్టారు. ఖజానాకు చేరాల్సిన పన్ను ఆదాయాన్ని కార్పొరేషన్ల ఖాతాలో వేసి, దాన్ని ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపి బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు. మద్యంపై వ్యాట్‌  ఆదాయంలో సింహ భాగాన్ని స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు తరలించి... దాన్ని ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా పేపర్లపై చూపించి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి దాదాపు రూ.40,000 కోట్లు అప్పు తెచ్చేందుకు జగన్‌ సర్కార్‌ రంగం సిద్ధం చేసింది’’ అని తెలిపారు. ఆ రెండు బ్యాంకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కోరారు. ధాన్యం, ఆక్వా ఉత్పత్తులపై మార్కెట్‌ ఫీజును పెంచేసి, దాన్ని ఆదాయంగా చూపి యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.1600 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు.


‘‘ఏపీ ేస్టట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనే సూట్‌కేసు కార్పొరేషన్‌ను సృష్టించి... దాని ద్వారా ఇతర శాఖలు, యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, అంతో ఇంతో డబ్బు నిల్వలున్న ఇతర కార్పొరేషన్ల డబ్బులను డిపాజిట్ల పేరుతో ప్రభుత్వం లాగేసుకుంది. డిపాజిట్ల సేకరణకు ఈ కార్పొరేషన్‌కు ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదు’’ అని తెలిపారు. సర్కారు అక్రమ పద్ధతుల్లో తెస్తున్న అప్పులపై రఘురామ ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. వచ్చేనెల 15న ఇది విచారణకు రానుంది.

Updated Date - 2022-05-20T08:13:03+05:30 IST