Mysore అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2022-06-16T17:26:38+05:30 IST

మైసూరు జిల్లా అభివృద్ధిలో ప్రతిపక్షనేత సిద్ద రామయ్య, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహల మధ్య మాటలయుద్ధం కొనసాగు తోంది.

Mysore అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

- సమయం, స్థలం నిర్ణయించండి

- ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు ఎంపీ ప్రతాప్‌సింహ సవాల్‌ 


బెంగళూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మైసూరు జిల్లా అభివృద్ధిలో ప్రతిపక్షనేత సిద్ద రామయ్య, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. బుధవారం ఎంపీ ప్రతాప్‌సింహ సవాల్‌ చేశారు. సమయం, స్థలం చెబితే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై చర్చకు బహిరంగ చర్చకు రావాలని, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ మంత్రి మహదేవప్ప ఎప్పుడు తేదీలు నిర్ణయించినా సిద్ధంగా ఉన్నానన్నారు. వారు ఎంతమంది వచ్చినా ఫర్వాలేదని నేను మాత్రం ఒంటరిగానే వస్తానన్నారు. 48 గంటల ముందే స్థలం, సమయం చెబితే చాలన్నారు. సిద్దరామయ్య సవాల్‌ను సాదరంగా స్వీకరిస్తున్నానన్నారు. అలా కాకుండా గ్రామపంచాయతీలో కూడా గెలవని అధికార ప్రతినిధిని పంపు తామంటే ఎలాగన్నారు. నాతో మాట్లాడేందుకు ఎందుకు వెనుకంజ అంటూ సిద్దరామయ్యను ప్రశ్నించారు. వేదికలపై గంటల తరబడి మాట్లాడే సిద్దరామయ్య బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా ఖాళీగా ఉండే మహదేవప్పను పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. నాతోచర్చకు మీకు గర్వం అడ్డు వస్తోందా..? లేదా భయం వెంటాడుతోందా..? అంటూ ప్రశ్నించారు. మైసూరుకు వారానికి రెండుసార్లు వచ్చే సిద్దరామయ్య అరగంట చర్చకు కేటాయించలేరా.. అని ప్రశ్నించారు. మీరు చేసిన అభివృద్ధి చెప్పుకొనేందుకు భయం ఎందుకని, మీ పార్టీ అధికార ప్రతినిధి వస్తే మా పార్టీ తరపున తాలూకాస్థాయి అధికారి ప్రతి నిధి వస్తారన్నారు. మీరే వస్తే సంతోషంగా చర్చించవచ్చునని సవాల్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే యోగా వేదికకు మైసూరు యువరాజుకు ఆహ్వానం లేదనే అంశమై మీడియా ప్రశ్నకు సమాధానంగా ప్రజా ప్రతినిధుల జాబితా మాత్రమే ప్రకటించానని, వీవీఐపీల జాబితా ఇంకా సిద్ధం కాలేదన్నారు. మైసూరు రాజవంశస్తులంటే గౌరవం ఉందన్నారు. 

Updated Date - 2022-06-16T17:26:38+05:30 IST