చంద్రబాబు చేతిలో పావుగా రఘురామ: ఎంపీ పిల్లి సుభాష్

ABN , First Publish Date - 2022-02-10T22:06:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఎంపీ రఘురామకృష్ణ రాజు పావుగా మారిపోయారని వైసీపీ

చంద్రబాబు చేతిలో పావుగా రఘురామ: ఎంపీ పిల్లి సుభాష్

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఎంపీ రఘురామకృష్ణ రాజు పావుగా మారిపోయారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సైతం సముచిత పాత్ర ఉందని, నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని ఆయన పేర్కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణ రాజును ఉపయోగించుకుంటున్నారన్నారు. హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో కోర్టులో ఒక పిటిషన్ పెట్టించారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారని ఆయన ధ్వజమెత్తారు.


సహజంగా రాజుల్లో పోరాట పటిమ ఉంటుందని, కానీ ఈ రాజుగారి విషయంలో మాటలు తప్ప, మరేమీ లేదని ఆయన  ఎద్దేవా చేశారు. ఈ మాటల తూటాలతో ప్రజల్లో పలచనైపోవడం తప్ప ఇంకేమీ లేదన్నారు. రాజీనామా చేస్తానని చెప్పి, పారిపోయారని రఘురామపై ఆయన మండిపడ్డారు. రాజులు ఎవరూ ఇలా చేయరని ఆయన హితవు పలకారు. టీడీపీ నుంచి ప్రత్యక్ష సహాయం తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా ఈ పనులను ఆపాలని ఇటు చంద్రబాబును, అటు రఘురామకృష్ణ రాజును ఆయన కోరారు.  ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, మనీ సర్క్యులేషన్‌లో ఉంచడమేనని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంత పని జరిగిందన్నది ముఖ్యం కాదన్నారు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణ రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారన్నారు. దీంతో పేదవారిపై వీరికున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు. 




రూ. 55,580 కోట్లతో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధానిని సీఎం జగన్ కలిసినప్పుడు పదే పదే కోరారన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సహా పలు విభాగాలు ఆమోదించినా సరే, కేంద్రం ఆమోదించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విభజన హామీలను పదేళ్లలో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు కనీసం రెవెన్యూ లోటును సైతం భర్తీ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి, ఎంపీలు ఎన్నిసార్లు అడగాలని ఆయన ప్రశ్నించారు. తాము ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు.  కానీ రఘురామకృష్ణ రాజు, చంద్రబాబు అడ్డుపుల్ల పిటిషన్లు వేస్తే తక్షణమే కేంద్రం స్పందిస్తోందన్నారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. 



Updated Date - 2022-02-10T22:06:50+05:30 IST