కల్యాణానికి పిలిచి అవమానిస్తారా?: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-20T21:51:50+05:30 IST

‘‘స్వామివారి కల్యాణానికి పిలిచింది అవమానించడానికా?’’ అంటూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో

కల్యాణానికి పిలిచి అవమానిస్తారా?: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం

ఏలూరు: ‘‘స్వామివారి కల్యాణానికి పిలిచింది అవమానించడానికా?’’ అంటూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరి కల్యాణ మహోత్సవ వేడుక మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించారు. మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అయితే కల్యాణ మహోత్సవ సమయానికి ముందే ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆలయానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. వాళ్లకు తెలియకుండానే మహోత్సవాన్ని ఆలయ అధికారులు ప్రారంభించేశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తాము సరైన సమయానికే వచ్చినా కల్యాణాన్ని జరిపించేటప్పుడు తమను ఎందుకు పిలవడలేదని ప్రశ్నించారు. తాము ముందే ఆలయానికి వచ్చినా పట్టించుకునేవారే లేరని ఆలయ అధికారులు, పాలకవర్గం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఎవరు ఇచ్చారని అధికారులను నిలదీశారు. ఆలయ ముఖమండపంలో 30 నిమిషాలకుపైగా ఉండిపోయారు. దళిత ఎమ్మెల్యేను అవమానిస్తారా అంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళతానన్నారు. ప్రభుత్వం అంటే లెక్క లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడతారా అని మండిపడ్డారు. 


అయితే అరగంట తర్వాత వారిని ఆహ్వానించడానికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకర్ రావు కుమారుడు నివృతరావు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. పూర్ణకుంభ స్వాగతం ఎందుకు పలకలేదని నివృతరావును ప్రశ్నించారు. ముగ్గురు ప్రజాప్రతినిధులను మహోత్సవానికి ఆహ్వానించి.. వారికి స్వాగతం పలకడానికి ఎందుకు రాలేదని నిలదీశారు. గతంలో లేని విధంగా ఇప్పుడే ఎందుకు ఇలా చేశారని మండిపడ్డారు. చివరకు నివృతరావు క్షమాపణ చెప్పడంతో  వివాదం కాస్త సద్దుమణిగింది. అనంతరం మంత్రి వనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెంకట్రావు స్వామి వారి కల్యాణ వేడుకకు హాజరయ్యారు.



Updated Date - 2021-10-20T21:51:50+05:30 IST