అందరివాడు రోశయ్య

ABN , First Publish Date - 2022-07-04T05:57:26+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అందరివాడని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

అందరివాడు రోశయ్య
రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

మాజీ సీఎం కొణిజేటి విగ్రహావిష్కరణ సభలో  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

మాచర్ల, జూలై 3: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అందరివాడని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం పట్టణంలో రోశయ్య విగ్రహావిష్కరణ  కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం స్థానిక శ్రీకోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోశయ్య అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ తాను చూస్తుంటానని, ఆయన మాటలను పుస్తక రూపంలో ప్రచురించి ఎమ్మెల్యేలకు అందించడం అవసరమని అన్నారు. రాజకీయంగా ఎన్ని సమస్యలున్నా చాకచక్యంగా పరిష్కరించిన గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. రోశయ్య మనవడు హర్ష ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

మంచి మనసున్న నాయకుడు రోశయ్య : పీఆర్కే

మంచి మనసున్న నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని ప్రభుత్వ విప్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనియాడారు. పల్నాడు ప్రాంతంలోని దుర్గి మిర్చియార్డుకు రోశయ్య శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రోశయ్యతో తనకున్న పరిచయాన్ని సభాముఖంగా గుర్తు చేసుకున్నారు.  రోశయ్య తనువు చాలించాక తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మాచర్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ముద్ధాలి గిరిధర్‌లు రోశయ్య సేవలను కొనియాడారు. ముందుగా ఆర్యవైశ్య నేతలు పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా ర్యాలీగా విగ్రహావిష్కరణ వద్దకు చేరుకున్నారు. నేతలంతా రోశయ్యవిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిషోర్‌, వైస్‌ చైర్మన్‌ పోలూరి నరసింహారావు, బోయ రఘురామిరెడ్డి, పోలా శ్రీనివాసరావు, సత్యనారాయణ, గోపవరపు నాగేశ్వరావు, గాలేశ్వరరావు, మేడం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T05:57:26+05:30 IST