అడయార్(చెన్నై): చిన్నారులు తమకు ఎదురయ్యే వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరిస్థితులతో పాటు, తాము ఎదుర్కొనే లైంగిక వేధింపులను బయటకు చెప్పేందుకు వీలుగా సమాజభద్రతతో కూడిన పరిస్థితులను కల్పించాలని డీఎంకేకు చెందిన తూత్తుకుడి ఎంపీ కనిమొళి కోరారు. కరూర్ జిల్లాలోని ఒక ప్రైవేటు కాలేజీకి చెందిన 17 యేళ్ళ బాలిక తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. ఈ బాలిక లైంగిక వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ లేఖను కూడా రాసిపెట్టింది. ఇప్పటికే కోయంబత్తూరులో జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే కరూర్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. దీనిపై కనిమొళి తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల కారణంగా కరూర్‌కు చెందిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో వేదనకు గురిచేసిందని, బాలికలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేలా, ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు వీలుగా రక్షణతో కూడిన పరిస్థితులను కల్పించాలని కోరారు. అంతేకాకుండా, ఇలాంటి నేరాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ ఒక ప్రతిఙ్ఞతో ముందుకుసాగాలని ఎంపీ కనిమొళి కోరారు.