వైసీపీ ఎంపీ ఇల్లు ముట్టడి

ABN , First Publish Date - 2021-02-28T05:31:40+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం..

వైసీపీ ఎంపీ ఇల్లు ముట్టడి
కార్మికులతో మాట్లాడుతున్న నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి

పరిశోధనా భూమిలో వైద్య కళాశాల వద్దు

నినదించిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు


నంద్యాల(కర్నూలు): నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్య కళాశాలను నిర్మించవద్దని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మికులు డిమాండ్‌ చేశారు. 106వ రోజు ఆందోళనలో భాగంగా శనివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటిని ముట్టడించారు. భారీ సంఖ్యలో వ్యవసాయ కార్మికులు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి సాయిబాబానగర్‌లో ఉన్న ఎంపీ ఇంటి ముందు ధర్నా చేశారు. కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌, నాయకులు గోపాల్‌, పుల్లయ్య, యల్లమ్మ, సుజాత, నాగేశ్వరమ్మ, రమణయ్య తదితరులు ధర్నాలో ప్రసంగించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిశోధనా ఫలితాలు రాష్ట్రానికే వన్నె తెస్తున్నాయని అన్నారు. అలాంటి ఆర్‌ఏఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేయాలనుకోవడం తగదని అన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి ప్రత్యేకంగా భూమి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసేలా ఎంపీ, ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. 


సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి జీవో నెంబరు 341ని వెంటనే రద్దు చేయించాలని కోరారు. స్పందించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి బయటకు వచ్చి కార్మికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే శిల్పా రవితో కలిసి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాముఖ్యతను సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వివరించామని తెలిపారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ను, వ్యవసాయ కార్మిక కుటుంబాలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఇచ్చిన హామీని ఎంపీ నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మికులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి గౌస్‌, తోట మద్దులు, రాజేష్‌, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:31:40+05:30 IST