Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై జగన్ నాన్చుడు ధోరణి

ABN , First Publish Date - 2022-08-06T19:25:54+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla Madhav)పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ (YCP)లో హైటెన్షన్‌ మొదలైంది.

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌పై జగన్ నాన్చుడు ధోరణి

అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla Madhav)పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ (YCP)లో హైటెన్షన్‌ మొదలైంది. మూడు రోజులుగా ఆ పార్టీ అధిష్ఠానం చర్చోపచర్చలు సాగిస్తున్నా.. ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఆయనపై వేటు వేస్తే.. పార్టీకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందేమోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నట్లుగా.. ఒకవేళ మాధవ్‌ పార్టీపై ఎదురుతిరిగితే పరిస్థితి ఏమిటని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 


మాధవ్‌ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో సీఎం జగన్ (CM Jagan) నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ఘటన జరిగి 52 గంటలు దాటినా ఇంకా జగన్ చర్యలు తీసుకోలేదు. ఫోరెన్సిక్ దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫోరెన్సిక్ దర్యాప్తుపై వైసీపీ నోరు మెదపడం లేదు. రాసలీలల వీడియో నిజమేనంటూ ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. లోక్‌సభ (Lok Sabha) సభ్యత్వానికి రాజీనామా చేయించినా.. భవిష్యత్‌లో ఇతరులపైనా ఆరోపణలొస్తే ఇదే ఒరవడి కొనసాగించి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందేమోనని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గానికి చెందినందునే తనపై వీడియో లీక్‌ చేశారంటూ మాధవ్‌ ఇప్పటికే బీసీ కార్డు ప్రయోగించారు. ఇది ప్రతిపక్షాలపై కంటే.. వైసీపీపైనే బాగా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో కొందరు వైసీపీ నేతల వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తాయని.. బీసీ కాబట్టే ఇప్పుడు మాధవ్‌పై వేటు వేశారని అంతా భావిస్తారని.. ఇది రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. మాధవ్‌ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.


ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్‌ను మాధవ్ కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మాధవ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో మాధవ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ప్రభుత్వాన్ని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖ రాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-06T19:25:54+05:30 IST