అమరావతిపై కేంద్ర తీరు సరికాదు

ABN , First Publish Date - 2020-08-08T08:11:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో తమ పాత్ర ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ..

అమరావతిపై కేంద్ర తీరు సరికాదు

మూడు రాజధానులకు నిధులు ఇస్తారా? 

ఎంపీ గల్లా జయదేవ్‌


గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో తమ పాత్ర ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని  హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయడం సరికాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రాను విడగొట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందిగా అని ప్రశ్నించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన మాట వాస్తవం కదా అన్నారు. ఆ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించి, అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 29 వేల మంది రైతులు ముందుకొచ్చి రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చారు కాబట్టే అమరావతికి పీపుల్స్‌ క్యాపిటల్‌ అని పేరుపెట్టామని తెలిపారు.


చట్టసభలో తీర్మానం నుంచి రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య ప్రక్రియ తర్వాత అమరావతి రాజధాని పురుడు పోసుకుందన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోండి ఆర్థికంగా కేంద్రం అండగా ఉంటుందని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.  భారత చిత్రపటంలోనూ అమరావతిని నోటిఫై చేశారని, కాని  ఇప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటే ఎలా అన్ని కేంద్రాన్ని ఎంపీ నిలదీశారు.


అమరావతిలో జరిగిన శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు కేంద్ర ప్రభుత్వం హాజరైందని గుర్తు చేశారు. రాజధానిని మార్చడానికి మొండిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంపై న్యాయస్థానాలలో మొట్టికాయలు పడుతున్న విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని గల్లా కోరారు. మూడు కొత్త రాజధానుల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు దీర్ఘకాలికంగా నష్టదాయకమని తెలిపారు.  తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందని.. అమరావతి విషయంలో తప్పక విజయం సాధిస్తామని గల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-08T08:11:26+05:30 IST