కేసీఆర్ గారూ.. ఇది నమ్మశక్యంగా లేదు : బండి సంజయ్ లేఖ

ABN , First Publish Date - 2020-03-31T23:12:58+05:30 IST

కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన వైద్య శాఖ సిబ్బందికి

కేసీఆర్ గారూ.. ఇది నమ్మశక్యంగా లేదు : బండి సంజయ్ లేఖ

హైదరాబాద్ : కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన వైద్య శాఖ సిబ్బందికి కూడా సగం జీతం కోత పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు తీసుకుంటున్న చర్యల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా రూపంలో విపత్కర పరిస్థితుల దృష్ట్యా, ప్రధాని నరేంద్ర మోదీ, పేద, సామాన్య ప్రజల లబ్ది కోసం సుమారు లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజీని అందుబాటులోకి తెచ్చిన విషయం ఆయన ఈ సందర్భంగా లేఖ రూపంలో గుర్తు చేశారు.

 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్/ఆఫ్ లైన్ విధానం ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ వద్ద నమోదైనా సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన , 2300 కోట్ల రూపాయల సెస్(CESS) నిధులను ఖర్చు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ, కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా, వెంటనే రాష్ట్రం లోని భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (DBT) ద్వారా నేరుగా డబ్బు పంపించే ఏర్పాటు చేయాలని బండి లేఖలో కోరారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోపట భరోసా కల్పించాల్సిన సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాద్యాయుల మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలలో  50% తగ్గించటంలో పునరాలోచించాలని ఆయన కోరారు.


నమ్మశక్యంగా లేదు..

ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే, ఇటువంటి నిర్ణయం తీసుకోవటం, కేవలం 15 రోజుల లాక్‌డౌన్‌కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాల విషయంలో, ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుందిఅని బండి లేఖలో వివరించారు.


మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే..!

స్వయంగా ప్రధాన మంత్రి గారు, లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారు. కానీ, మీరు తీసుకున్న నిర్ణయాన్ని అలుసుగా తీసుకొని, ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారస్తులు, వారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల, కార్మికుల జీతాల్లో  కోతలు విధించే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంపుదలకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకుని తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ, వైద్యులు, నర్సులు, నాలుగవ తరగ తి సిబ్బంది, పోలీస్ మరియు ఇతర శాఖల సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించటంతో పాటు, వారికి వ్యక్తిగత రక్షణ సామగ్రి( మాస్కులు, PPE) వెంటనే సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలిఅని బండి సంజయ్ లేఖలో కోరారు.

Updated Date - 2020-03-31T23:12:58+05:30 IST