వేడెక్కిన ఓరుగల్లు.. కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2020-07-13T16:25:53+05:30 IST

కరోనా వైరస్‌ ఉధృతితో ప్రశాంతంగా ఉన్న వరంగల్‌ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు.

వేడెక్కిన ఓరుగల్లు.. కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు..

బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్‌ ఉధృతితో ప్రశాంతంగా ఉన్న వరంగల్‌ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌లపై కూడా మాటల దాడి చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, సంతోష్ లకు 2023 తర్వాత చెంచల్‌గూడ జైలేనని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ దొంగ హిందువు, దగుల్బాజీ హిందువు అంటూ అరవింద్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కబ్జాల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, నన్నపునేని నరేందర్‌ బిల్లా-రంగాలు అంటూ వ్యంగ్యంగా సంభోదిస్తూ నగరంలో గజం భూమిని కూడా విడువకుండా కబ్జాలు చేస్తారని విన్నానన్నారు.. ఇదే విధంగా పెద్ద ఎత్తున కేసీఆర్‌, కేటీఆర్‌లను పరుష పదజాలంతో విమర్శించారు.


బీజేపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి..

అరవింద్‌ వ్యాఖ్యల సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హంటర్‌ రోడ్‌లోని బీజేపీ అర్బన్‌ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి దిగారు. అరవింద్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకు దూసుకువచ్చారు. ఎంపీ అరవింద్‌ కుమార్‌ కాన్వాయ్‌పై మీద దాడికి యత్నించారు. కాగా, కోడిగుడ్లతో, రాళ్ళతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని, తన చేతి వేలికి గాయం అయిందని రావు పద్మ పీఏ ఎలుక నిశాంత్‌ అన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆరుగురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 


ఎదురుదాడికి బీజేపీ యత్నం..

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడితో అవాక్కయిన బీజేపీ శ్రేణులు కొద్ది సేపటి తర్వాత పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో క్యాంప్‌ ఆఫీస్‌ దిశగా కార్యకర్తలతో దూసుకుపోయారు. పోలీసులు వారిని అడ్డుకుని రావు పద్మ వాహనం తాళం చెవి లాక్కున్నారు. దీంతో ఆమె కార్యకర్తలతో అక్కడనే కొద్ది సేపు టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అమర వీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్దపడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ నేత రావు పద్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. బీజేపీ కార్యకర్తలు సుమారు 40 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని హన్మకొండ, సుబేదారి, కాజేపీట పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.  అనంతరం విడుదల చేశారు.


టీఆర్‌ఎస్‌ నాయకుల అరెస్టు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణలు చేయడంతో ఆదివారం వరంగల్‌ హం టర్‌రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. మీడియా సమావేశం అనంతరం తిరిగి వెళ్తున్న అరవింద్‌ వాహనాన్ని  అడ్డుకుని కోడిగుడ్లతో దాడి చేశారు. వెంటనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అప్రమత్తమై నిరసనకారులను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆంగోత్‌ కిషోర్‌, రావులకొలను నరేంద్ర, శ్రీకాంత్‌చారి, గండికోట రాకేశ్‌, శ్రవన్‌కుమార్‌లను అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. ఎంపీ స్వేచ్ఛకు భంగం కలిగించినందుకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హన్మకొండ ఏసీపీ మూల జితేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-07-13T16:25:53+05:30 IST