హైదరాబాద్: బైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కోరారు. ఈ రోజు డీజీపీని కలిసి బైంసా ఘటనపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ బైంసా ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. బైంసా బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం తమకు లేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులపై టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడి చేసింది ముస్లింలు అయితే, హిందువులను అరెస్టులు చేయటం అన్యాయమని ఆయన అన్నారు.
తెలంగాణలో కావాల్సిన దానికంటే ఎక్కువ లౌకికవాదం అమలవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌర సమాజం పట్ల ఎలా వ్యవహరించాలో ఓవైసీ సోదరులకు నేర్పిస్తామని ఎంపీ అరవింద్ తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎంపీలు సోయం, ధర్మపురి అరవింద్, రాజాసింగ్, వివేక్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.