సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు

ABN , First Publish Date - 2021-01-27T05:43:34+05:30 IST

జిల్లాలో సాధారణ వర్షపాతం 700 మి.మీ కాగా 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 1132 మి.మీ. వర్షం కురిసిందన్నారు.

సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు
జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ తదితరులు

జిల్లా యంత్రాంగం నిర్విరామ కృషి

62 శాతం అధిక వర్షపాతంతో 13 జలాశయాల్లో జలకళ

25 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్య పరికరాల ఏర్పాటు

2600 మంది విద్యార్థులకు కంటి చికిత్సలు

నీటి సంరక్షణలో జాతీయ అవార్డు

పారిశ్రామికవాడల అభివృద్ధికి కార్యాచరణ

కరోనాలో 99 శాతం రికవరీ

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ హరికిరణ్‌


అన్ని వర్గాల ప్రజలకు ఆయా శాఖల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. జిల్లాలో 62 శాతం అధిక వర్షపాతాన్ని వినియోగించుకుని 13 జలాశయాల్లో 75 టీఎంసీల నీటిని నిలువ చేసుకోగలిగాం. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని 99 శాతం రికవరీ సాధించగలిగాం. వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా అమలు చేసి మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టే దిశగా వెళుతున్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేశాం. ఇందుకోసం జిల్లా యంత్రాంగం నిర్విరామంగా  కృషి చేస్తోందని కలెక్టరు హరికిరణ్‌ అన్నారు. ఆయన మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కడప పోలీసు పరేడ్‌ గ్రౌండులో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో సాధించిన ప్రగతి సాధించాల్సిన లక్ష్యాలు వివరించారు.


కడప (సిటి)/క్రైం, జనవరి 26 : జిల్లాలో సాధారణ వర్షపాతం 700 మి.మీ కాగా 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 1132 మి.మీ. వర్షం కురిసిందన్నారు. దీంతో 13 జలాశయాల్లో గరిష్టస్థాయి 83.86 టీఎంసీలకు గాను 75.41 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలిగామని తెలిపారు. జిల్లాకు గుండెలాంటి గండికోట ప్రాజెక్టు సామర్థ్యం మేర 26.85 టీఎంసీలు నిల్వ చేసి రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు తమ తమ సామర్థ్యం నిరూపించుకున్నారన్నారు. 


25 వేల హెక్టార్లలో సూక్ష్మసేద్య పరికరాలు

2020-21 ఖరీ్‌ఫలో లక్షా 9 వేల 757 హెక్టార్లు, రబీలో లక్షా 40 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయన్నారు. సూక్ష్మనీటి సాగులో భాగంగా గత సంవత్సరం 22 వేల హెక్టార్లలో పరికరాలు ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం 25 వేల హెక్టార్లకు విస్తరించనున్నట్లు చెప్పారు. నివర్‌ తుఫాను కారణంగా 1.37 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, 5400 హెక్టార్లలో ఉద్యాన పంటలు నాశనమయ్యాయని, రూ.545 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఈ వివరాలను కేంద్ర స్థాయి పరిశీలకులకు వివరించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో లక్షా 69 వేల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల కరెంటు ఇస్తున్నామని, మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం 21 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు.


ఆరోగ్యం, విద్యలలో విస్తృత సేవలు

పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లాలో 106 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నామన్నారు. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు 63 వేల మందికి శస్త్రచికిత్సలు చేయించామన్నారు. జిల్లాలో మొదటి విడత కింద 1040 పాఠశాలల్లో ఆధునీకరణ పనులు పూర్తి చేశామని, 3262 పాఠశాలల విద్యార్థులకు కొత్త మెనూ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అలాగే 2600 మంది విద్యార్థులకు కంటి చికిత్సల కోసం రెఫర్‌ చేశామన్నారు.


4 లక్షల మందికి 133 లక్షల పనిదినాలు

కరోనాతో ఆర్థిక పరిస్థితి కుదేలైందని, అయితే ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పటి వరకు 4 లక్షల మంది కూలీలకు 133 లక్షల పని దినాలు కల్పించి రూ.488 కోట్లు ఖర్చు చేశామన్నారు. పచ్చదనం పెంపులో భాగంగా 33 శాతం ప్రాంతాన్ని అటవీకరణ చేశామని, గ్రామీణ రోడ్లకిరువైపులా మొక్కలు నాటించామని, సంరక్షించడానికి ప్రతి అర కిలోమీటరుకు ఒక వాచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


నీటి సంరక్షణలో జాతీయ అవార్డు

నీటి సంరక్షణ పనుల్లో జిల్లాకు జాతీయ స్థాయిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అవార్డు, ప్రధమ బహుమతి లభించిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నీటి సంరక్షణ కారణంగా ఈ సంవత్సరం నీటిమట్టం 13 మీటర్లు పెరిగిందన్నారు. ఇంకా జిల్లాలో పారిశ్రామికవాడల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కడప నగరం సహా అన్ని మున్సిపాలిటీల్లో సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. బాఽధిత మహిళలకు సఖి-దిశ సెంటర్లు అండగా నిలుస్తున్నాయని, ఇప్పటి వరకు రిజిస్టరైన 742 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 


కరోనాలో 99 శాతం రికవరీ

జిల్లాలో ఇప్పటి వరకు 8.70 లక్షల కరోనా శాంపిల్స్‌ సేకరించగా 6 శాతంతో 55 వేలు పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. అయితే ఇందులో 99 శాతం రికవరీ కావడం విశేషమన్నారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల సహకారంతో సాధ్యమైందన్నారు. జిల్లాలో 29,500 డోస్‌ల వ్యాక్సిన్‌ సరఫరా చేశామని, ఇప్పటి వరకు 68 టీకా కేంద్రాల ద్వారా 10,520 మందికి వ్యాక్సినేషన్‌ చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారం, యంత్రాంగం కృషితో జిల్లాలో సమగాభ్రివృద్ధి సాధిస్తామన్నారు.


293 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం కడప పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్నత ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన 293 మంది ఉద్యోగులకు కలెక్టరు ప్రశంసాపత్రాలు అందించారు. వారి విధి నిర్వహణ పట్ల ఆయన అభినందించారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారి వివరాలు ఇలా.. 


ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు

కడప నగరం జిల్లా పోలీసు ప్రాంగణంలోని పోలీసు పెరేడ్‌ మైదానంలో మంగళవారం ఉదయం ప్రారంభమైన 72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ హరికిరణ్‌, జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తంకుమార్‌, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌లు జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం కలెక్టర్‌, ఎస్పీతో కలిసి పెరేడ్‌ను పరిశీలించారు. పోలీసులు, ఏఆర్‌ సిబ్బంది, సీనియర్‌ ఎన్‌సీసీ బాయిస్‌ ఆధ్వర్యంలో వివిధ ప్లాటూన్‌లు, మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి వారికి గౌరవ వందనం చేయడంతో జిల్లా ఉన్నతాధికారులు వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు.  వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో జలవనరులశాఖ, పశుసంవర్థక, పౌర సరఫరాలశాఖ, ఇంటింటికీ రేషన్‌ మొబైల్‌ వాహనాలు, వైద్య ఆరోగ్యశాఖ, 108, 104 వాహనాలు, సంజీవని వాహనం, గృహ నిర్మాణశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌, జిల్లా మహిళా శిశు అభివృద్ధి, ఐసీడీఎస్‌శాఖ, వ్యవసాయశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా), పోలీసుశాఖ ఆధ్వర్యంలో మైన్‌ప్రూ్‌ఫ వాహనం, అగ్నిమాపకశాఖల ప్రగతి శకటాలు మైదానంలో ప్రదర్శించారు. 


స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోఽధులు మన మధ్య లేకపోవడంతో వారి సతీమణులైన రామలింగరాజు సతీమణి సీతాలక్షుమ్మ, ఫక్కీరప్ప సతీమణి దస్తగిరమ్మ, బి.సుబ్బయ్య సతీమణి నారాయణమ్మలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. 


అలరించిన పోలీసు జాగిలాల విన్యాసాలు

పోలీసు డాగ్‌స్క్వాడ్‌ ఆధ్వర్యంలో జాగిలాలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నేరపరిశోధన, హంతకుల గుర్తింపును ఎలా పసిగడతాయన్న ప్రదర్శన ఇచ్చారు. అనంతరం స్కౌట్స్‌ విద్యార్థులు చేసిన పిరమిడ్‌ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. పాఠశాల విద్యార్థినులు జాతిమతం బేధం మరిచి అంటూ కరోనా వైరస్‌ నియంత్రణలో పాల్గొన్న పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు చేసిన త్యాగాలు నృత్యం ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. యువతీ యువకులు చేసిన కర్రసాము విన్యాసాలు ప్రాచీన కళల ప్రాశస్త్యాన్ని చాటిచెప్పాయి. 


అబ్బురపరిచిన ఫైర్‌ విన్యాసాలు

కడప ఫైర్‌ అధికారి బసివిరెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించేలా చేసిన ప్రదర్శన అబ్బురపరిచాయి. అనంతరం నీటి రూపంలో గాలిలో మువ్వన్నెల జెండాను ప్రదర్శించడం అక్కడ కనువిందు చేసింది. 28వ జాతీయ కాంగ్రె్‌సలో జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కాగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శనలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి ప్రధమ బహుమతి లభించగా జలవనరులశాఖ శకటానికి ద్వితీయ బహుమతి పొందారు. గృహనిర్మాణ శాఖ, విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖలు సంయుక్తంగా తృతీయ బహుమతి పొందగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు, పంచాయతీరాజ్‌ శాఖలకు కన్సలేషన్‌ బహుమతులు లభించాయి. అలాగే ఆర్మ్‌డ్‌ రిజర్వు మైన్‌ శకట  సిబ్బంది ప్రధమ బహుమతి అందుకోగా ఎన్‌సీసీ బాయి్‌సకు ద్వితీయ బహుమతి స్కౌట్‌ గైడ్స్‌ వారు తృతీయ బహుమతి పొందగా, అగ్నిమాపక శాఖకు కన్సొలేషన్‌ బహుమతి లభించింది. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి, సాయికాంత్‌వర్మ, ధర్మచంద్రారెడ్డి, అడిషనల్‌ ఎస్పీలు ఖాసింఖాన్‌, దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డితో పాటు కడప జిల్లా అధికారులతో పాటు డివిజనల్‌ ఆర్డీవో, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-27T05:43:34+05:30 IST