త్యాగధనుల స్ఫూర్తితో మున్ముందుకు..

ABN , First Publish Date - 2022-08-16T05:58:28+05:30 IST

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగఫలమే ఈస్వేచ్ఛా స్వాతంత్య్రమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను ఎప్పటికీ మరవొద్దన్నారు. మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

త్యాగధనుల స్ఫూర్తితో మున్ముందుకు..
జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి, అధికారులు

ప్రగతిపథంలో పయనిస్తున్న మెదక్‌ జిల్లా

కొత్తగా 20 వేల మందికి ఆసరా 

‘దళితబంధు’తో వెలుగులు 

మెదక్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

కనువిందు చేసిన పోలీసుల పరేడ్‌

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

 

ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 15: దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగఫలమే ఈస్వేచ్ఛా స్వాతంత్య్రమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను ఎప్పటికీ మరవొద్దన్నారు. మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను ఎన్నటికీ మరిచిపోకూడదన్నారు. సమైక్య పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడానికి ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో పోరాటం చేశారని తలసాని గుర్తు చేశారు. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా వివిధ రంగాల్లో ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా విద్యారంగం అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఆగస్టు 15 నుంచి జిల్లాలో 20 వేల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు అందనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. పదో తరగతి ఫలితాల్లో మెదక్‌ జిల్లా 11వ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా 3వేల పైచిలుకు చెరువులను అభివృద్ధి చేసినట్లు మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 66 వేల ఎకరాలకు, మల్లన్నసాగర్‌ ద్వారా 1.33 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, రైతులకు ఎరువులు సకాలంలో అందడానికి మెదక్‌లో ర్యాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేశామని తలసాని తెలిపారు. పౌరసరఫరాలశాఖ ద్వారా 2021-2022లో 2.81 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లు, పాడి రైతులకు సబ్సిడీపై పాడి పశువులు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సాహిస్తుందన్నారు. చేప పిల్లలను చెరువుల్లో వదలడానికి 5 కోట్ల చేప పిల్లలను 100 శాతం సబ్సిడీపై అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలో పేదల కోసం 4965 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 2344 ఇండ్లు పూర్తయ్యాయన్నారు. మరో 1300 ఇళ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతామని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలకు ఆసరా పింఛన్లు అందజేశారు. ఈ వేడుకల్లో మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో సోమవారం సంబురంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సిద్దార్థ్‌, గీతా, గిరిజన, తెలంగాణ గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మెప్పించాయి. అలాగే పోలీసుల పరేడ్‌ కనువిందు చేసింది. గ్రామగ్రామాన త్రివర్ణ పతకం రెపరెపలాడింది.



Updated Date - 2022-08-16T05:58:28+05:30 IST