Chitrajyothy Logo
Advertisement

టికెట్లు తెగడం లేదు గురూ!

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రపరిశ్రమలో హిట్‌, ప్లాప్‌ సర్వసాధారణం. ఇందులో అగ్ర హీరోలు, చిన్న హీరోలు అనే మినహాయింపు  లేనేలేదు. అయితే ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అగ్ర హీరోలపై అపజయ ప్రభావం అంతగా ఉండదు. కాకపోతే కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఇటువంటి అపజయాలు హెచ్చరిస్తుంటాయి. అందుకే ప్లాప్‌ సినిమాలతో కాస్త ట్రాక్‌ తప్పినా, మళ్లీ మంచి కథలను ఎన్నుకొని బౌన్స్‌ బ్యాక్‌ అవడం మనం చూస్తున్నదే. అయితే ఇప్పుడు మాత్రం కథ కొంచెం భిన్నంగా ఉంటోంది. ఇంతకుముందు పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతుంటే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడేవి. ఓపెనింగ్స్‌ అదిరిపోయేవి. హిట్‌, ప్లాప్‌ అనే తేడా లేకుండా తొలి వారమంతా ఈ జోరు కొనసాగేది. ఇప్పుడు ఆ సీన్‌ మారిపోయింది. మీడియం రేంజ్‌ హీరోల చిత్రాలకే కాదు అగ్ర హీరోల సినిమాలకు కూడా కొన్ని చోట్ల ఓపెనింగ్స్‌ కరువవుతున్నాయి. ఇటీవల విడుదలైన అగ్ర హీరోల చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు చూసి  చిత్రపరిశ్రమ నివ్వెర పోతోంది. ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు ట్రేడ్‌ను కలవర పెడుతోంది. 


అప్పటి పరిస్థితి వేరు

 కరోనాకు ముందు పరిస్థితి వేరు. ప్రతి  శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు సందడి సందడిగా ఉండేవి. పెద్ద సినిమా విడుదలవుతోందంటే చాలు టిక్కెట్లు సంపాదించడం కోసం ప్రేక్షకులు ఎన్నో మార్గాలు అనుసరించేవారు. బ్లాక్‌లో కొనడానికి కూడా సిద్ధపడేవారు. మొదటి రోజున మొదటి ఆట చూసెయ్యాలనే ఉత్సాహం వారిలో కనిపించేది. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడేవారు కాదు. చిన్న సినిమాల విడుదల సమయంలో ఇంత సందడి ఉండేది కాదు కానీ సినిమా బాగుందని టాక్‌ వస్తే చాలు టిక్కెట్లు బాగా తెగేవి. కరోనా వచ్చి చిత్రపరిశ్రమతో ఓ ఆట ఆడుకుంది. థియేటర్లు కుదేలయ్యాయి. కలెక్షన్లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు కరోనా ముప్పు తొలగి పోయినా సినిమా విడుదల సమయంలో థియేటర్ల దగ్గర ఇంతకుముందున్న ఊపు కనిపించడం లేదు. టికెట్లు తెగడం లేదు.. అనే మాట కామన్‌గా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పెద్ద సినిమాలు విడుదలయినప్పుడు తొలి వారం రోజులు టికెట్‌ రేట్లకు రెక్కలు రావడమే అంటున్నారు ట్రేడ్‌ పండితులు. వారం తర్వాత టికెట్‌ రేట్లు తగ్గుతాయి కనుక అప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దాంలే అనే ఽఽధోరణి క్రమంగా పెరుగుతోంది. ఇది సినిమా వసూళ్లపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది.


హిట్‌ టాక్‌ వచ్చినా 

గతంలో తెలుగు సినిమాలు వంద రోజులు, 25 వారాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. శత దినోత్సవాలు కూడా ఘనంగా జరిగేవి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మొదటి రోజు ఎంత వసూలు అయింది అనేది ఇప్పుడు చూస్తున్నారు. తొలి రోజు రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు సాధిస్తే, ఆ విషయాన్నే ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పెరిగిన టికెట్‌ ధరలు ఆ వసూళ్ల రికార్డులను కూడా దెబ్బ తీస్తున్నాయి. మీడియా, సోషల్‌ మీడియా ప్రచారంతో  హోరెత్తిస్తున్నారు కానీ  సగటు ప్రేక్షకుడు థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. టికెట్‌ బుకింగ్‌ యాప్స్‌లో మాత్రం ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. హిట్‌ టాక్‌ తెచ్చుకున్నా, సినిమా బాగుందన్న మౌత్‌టాక్‌ వచ్చినా థియేటర్లలో టికెట్లు తెగడం లేదు. ఇటీవల ఇద్దరు మీడియం రేంజ్‌ హీరోలు నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. వీటికి పోటీగా మరే పెద్ద చిత్రం కూడా బరిలో లేదు. అయినా ప్రేక్షకులు ఈ థియేటర్ల గడప తొక్కడానికి ఇష్టపడలేదు.  గతంలో వీరు నటించిన సినిమాలను యూత్‌  బాగానే ఆదరించారు. సినిమాలకు మంచి వసూళ్లు దక్కాయి. ఈసారి మాత్రం గల్లాపెట్టె నిండలేదు. పైకి తమ సినిమాలు హిట్‌ అని గంభీరంగా ప్రకటించుకున్నా లోపల మాత్రం ఏం చేయాలా తెలియక చిత్రబృందాలు తలలు పట్టుకున్నాయి. దానికి తోడు నెల రోజులు ఆగితే ఆ సినిమా ఓటీటీలో వస్తుందనే నమ్మకం ప్రేక్షకులలో పెరిగి పోతుండడం మీడియం రేంజ్‌ చిత్రాలకు శాపంగా మారింది. ఇటీవలె విడుదలైన ‘రాధేశ్యామ్‌’ డిజాస్టర్‌ అయింది. వరుసగా విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ లాంటి పెద్ద చిత్రాలకు దర్శకులు, హీరోల  స్టార్‌డమ్‌ ఉపయోగపడింది. టికెట్‌ ధరలు భారీగా పెంచి, మంచి హైప్‌ తేవడంతో కంటెంట్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా బాక్సాఫీసు దగ్గర సందడి చేశాయి. కానీ చిన్న సినిమాలకు ఈ తరహా ప్రచారం లాభించడం లేదు.

వేసవి నిరాశ

‘అఖండ’, ‘పుష్ప’, భీమ్లానాయక్‌’ థియేటర్లకు రప్పించారంటే సినిమా బాగుండడంతో పాటు స్టార్‌ హీరోల సత్తా వర్కవుట్‌ అయింది. అలాగని ఇదేదో పూర్తిగా చిన్న హీరోలకు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమవలేదు. ఎంత ప్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నా చిరంజీవి సినిమా అంటే కొన్ని రోజుల దాకా థియేటర్లు కిటకిటలాడాల్సిందే. అయితే కరోనా తర్వాత విడుదలైన చిరంజీవి తొలి చిత్రం ‘ఆచార్య’ విషయంలో ఈ మ్యాజిక్‌ రిపీట్‌ అవలేదు. మెగాఫ్యాన్స్‌ ఒక్కసారి చూసినా థియేటర్లు నిండిపోయేవి. ఎందుకో ఈ సినిమాను చూసే విషయంలో ఒకింత ఉదాసీనంగా కనిపించారు మెగాఫ్యాన్స్‌. పైగా తండ్రి పక్కన రామ్‌చరణ్‌ తొలిసారి పూర్తిస్థాయి నిడివి పాత్రను  పోషించారు. అయినా టికెట్లు ఆశించిన స్థాయిలో మాత్రం తెగలేదు అనే చెప్పాలి. భారీ బ్లాక్‌బస్టర్‌ చూడాలన్న పరిశ్రమ ఆశ తీరకుండానే వేసవి సీజన్‌ కూడా ముగిసిపోతోంది. 


పదోవంతు వసూళ్లు చాలాకష్టం

బాలీవుడ్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. అలియాభట్‌ ‘గంగూబాయి కథియావాడి’ ‘ద కశ్మీర్‌ఫైల్స్‌’ మాత్రమే బాక్సాఫీసు హిట్లుగా నిలిచాయి. మరే హిందీ సినిమా కూడా ఈ ఏడాది ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ హిట్‌ కొట్టలేదు. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘బచ్చన్‌పాండే’ రూ. 60 కోట్లు వసూలు చేయడానికి ఆపసోపాలు పడింది. గతేడాది వచ్చిన ‘సూర్యవంశీ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లను సాధించింది. అజయ్‌ దేవగణ్‌ ‘రన్‌వే 34’ అతి కష్టం మీద 40 కోట్ల వసూళ్లను టచ్‌ చేసింది. కరోనాకు ముందు ఆయన నటించిన ‘తానాజీ’ ఒక్క ఇండియాలోనే రూ. 280 కోట్ల వసూళ్లను సాధించింది. యువహీరో టైగర్‌ష్రాఫ్‌ నటించిన ‘హీరోపంటి 2’ రూ. 35 కోట్ల వసూళ్లను సాధించింది. ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు అదే షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన రీమేక్‌ చిత్రం ‘జెర్సీ’ అందులో పదోవంతు వసూళ్లను కూడా సాధించలేక ఉసూరుమంది. ఏది ఏమైనా నెలకో హిట్‌ అయినా పడనిదే బాలీవుడ్‌కు పాత కళ రాదు. ఆ రోజు తొందర్లోనే రావాలనేది అందరి కోరిక.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement