‘తెర’మరుగు!

ABN , First Publish Date - 2022-01-17T05:02:29+05:30 IST

వినోదం పంచడంలో సినిమా థియేటర్లదే అగ్రస్థానం. ఏడాది పొడవునా ప్రేక్షకులతో కళకళలాడేవి. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా తరువాత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. బుల్లితెరతో పాటు ఓటీటీ తెరపైకి రావడం కూడా థియేటర్లకు ఆదరణ తగ్గడానికి ఒక కారణం. థియేటర్ల మూతతో ఎంతో మంది ఉపాధి ‘తెర’మరుగవుతోంది.

‘తెర’మరుగు!

మూత దిశగా సినిమా థియేటర్లు

జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్నవి 34

నిర్వహణ భారంలో యాజమాన్యాలు

నడిపించలేమని చేతులెత్తేస్తున్న వైనం

ఉపాధికి దూరమవుతున్న వందలాది మంది సిబ్బంది 

(రణస్థలం)

వినోదం పంచడంలో సినిమా థియేటర్లదే అగ్రస్థానం. ఏడాది పొడవునా ప్రేక్షకులతో కళకళలాడేవి. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా తరువాత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. బుల్లితెరతో పాటు ఓటీటీ తెరపైకి రావడం కూడా థియేటర్లకు ఆదరణ తగ్గడానికి ఒక కారణం. థియేటర్ల మూతతో ఎంతో మంది ఉపాధి ‘తెర’మరుగవుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో కొన్నేళ్ల కిందట వరకూ 70 థియేటర్లు ఉండేవి. కానీ ప్రస్తుతం నడుస్తున్నవి 34. మిగతావి రైస్‌మిల్లులు, కల్యాణ మండపాలు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కరోనా వ్యాప్తి తరువాత సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు ఏడాది పాటు పూర్తిగా మూతపడ్డాయి. తరువాత ఆంక్షలతో అనుమతించినా చాలావరకూ తెరచుకోలేదు. ఇప్పడిప్పుడే  కోలుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానాన్ని తెరపైకి తేవడం, టిక్కెట్‌ ధరలను తగ్గించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా వాటి పరిస్థితి తయారైంది. తగ్గిన టిక్కెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి.   విద్యుత్‌ చార్జీలు, సిబ్బందికి జీతాలు, నిర్వహణ ఖర్చులు  కూడా రాని దుస్థితి ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా థియేటర్‌లో మేనేజర్‌, సూపర్‌వైజర్‌, అసోసియేట్స్‌, హౌస్‌ కీపింగ్‌, తదితర సిబ్బంది 15 నుంచి 25 మంది వరకూ ఉంటారు. పెద్ద నగరాల్లో అయితే వీరికి జీతాలు రూ.5 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాలు, మండల కేంద్రాల సిబ్బంది అయితే రూ.2 లక్షలు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. థియేటర్‌కు నెలకు రూ.లక్షల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు ఏసీ థియేటర్లు అందుబాటులోకి రావడంతో విద్యుత్‌ వినియోగం అదనమైంది. ఇవన్నీ భరించలేని యాజమాన్యాలు థియేటర్లు అద్దెకిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల చేతిలోనే ఉన్నాయి. 


 తగ్గిన టిక్కెట్‌ ధరతో ఇక్కట్లు

ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానంతో టిక్కెట్లు ధరలు గణనీయంగా తగ్గాయి.కార్పొరేషన్‌ పరిధిలోని ఏ సెంటర్లలో గరిష్ట టిక్కెట్‌ ధర రూ.112, మధ్యస్తం రూ.60, కనిష్ఠ టిక్కెట్‌ ధర రూ.40గా నిర్ణయించారు. మునిసిపాల్టీల పరిధిలో గరిష్టం రూ.70, మధ్యస్తం రూ.50, కనిష్టం రూ.40, పంచాయతీల్లో గరిష్టం రూ.20, మధ్యస్తం రూ.15, కనిష్ట టిక్కెట్‌ ధర రూ.10గా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తొమ్మిది థియేటర్లు ఉన్నాయి. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ, రాజాం మునిసిపాల్టీల్లో 15 థియేటర్లు వరకూ ఉన్నాయి. మిగతావి పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దీంతో వాటికి ఆదాయం పడిపోయింది. కరోనా తరువాత ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు చూడడం లేదు. ఒక్కో షోకు పదుల సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. టిక్కెట్ల రూపంలో వచ్చిన ఆదాయం విద్యుత్‌ చార్జీలకు కూడా చాలడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మోస్తరు పట్టణాల్లో మాత్రమే థియేటర్లు నడిచే అవకాశాలున్నాయి. మిగతాచోట్ల యాజమాన్యాలు థియేటర్లు మూసివేసి ప్రత్యామ్నాయ వ్యాపారాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో  వందలాది మంది కార్మిక కుటుంబాలకు ఉపాధి దూరమైనట్టే.


 ఇబ్బంది పడుతున్నాం.

కరోనా సమయంలో థియేటర్లు మూతపడినప్పుడు కుటుంబాలతో ఇబ్బంది పడ్డాం. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లు కొనసాగడం చాలా కష్టం. టిక్కెట్‌ ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. కార్మికుల పరిస్థితిని గమనించి రాయితీలు ప్రకటించాలి. 

-కె.రామారావు, థియేటర్‌ కార్మికుడు, రణస్థలం

Updated Date - 2022-01-17T05:02:29+05:30 IST