Jun 22 2021 @ 16:40PM

జూలై నుంచి సినిమా షూటింగులు?

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అనేక జిల్లాల్లో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. కానీ, 11 జిల్లాల్లో మాత్రం అధికంగా నమోదవుతోంది. అవి మినహా మిగిలిన జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను చాలా మేరకు సడలించారు. అదేసమయంలో చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్ళూరు జిల్లాల్లో సిటీ బస్సులను కూడా నడుపుతున్నారు. అదేసమయంలో వంద మందితో సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 


ఇప్పటికే అనేక సినిమాల షూటింగులు హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో శరవేగంగా సాగుతున్నాయి. ఇపుడు రాష్ట్రంలో కూడా పరిమితమైన యూనిట్‌ సభ్యులతో షూటింగులు జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అదేసమయంలో ఈ నెల 28వ తేదీ వరకు ఇతర జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ కారణంగా చెన్నైయేతర జిల్లాల్లో షూటింగ్‌ జరపడం కష్టసాధ్యంగా మారుతుంది. అందుకే జూలై ఆరంభం నుంచి అనేక చిత్రాలు తిరిగి సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో అనేక జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఎత్తివేయవచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో జూలై నెల నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగులు జరపాలన్న భావనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు సూర్య, విజయ్‌ వంటివారు తమతమ చిత్రాల షూటింగులను జూలై పదో తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.