పెద్ద మనసున్న మనిషి సుకుమార్‌

ABN , First Publish Date - 2021-08-02T06:34:10+05:30 IST

ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌..

పెద్ద మనసున్న మనిషి సుకుమార్‌

ఆయన తండ్రి పేరిట మట్టపర్రులో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభ సభలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు


మలికిపురం(తూర్పు గోదావరి): ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ పెద్ద మనసున్న మనిషి అని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. సుకుమార్‌ తన తండ్రి తిరుపతిరావునాయుడు పేరున రూ.18 లక్షలతో నిర్మించిన పాఠశాల భవన సముదాయాన్ని సుకుమార్‌ దంపతులు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రారంభించారు. సర్పంచ్‌ కడలి దుర్గాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గానికి మంచిపేరు తెచ్చిన వ్యక్తి సుకుమార్‌ అన్నారు. కొందరు తల్లిదండ్రుల కష్టంతో ఉన్నత శిఖరాలకు ఎదిగి వారి మాట మర్చిపోతారని, కానీ సుకుమార్‌ తన తల్లిదండ్రులపై మమకారంతో ఇటువంటి సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. తల్లిదండ్రులను పట్టించునేవాడు గ్రామాన్ని, ఈ ప్రాంతాలను కూడా పట్టించుకుంటారని, కొవిడ్‌ సమయంలో మట్టపర్రు గ్రామస్తులకు సుకుమార్‌ ఎనలేని సేవలు అందించారన్నారు. తన గ్రామంలోని పలువురు ప్రమాదాలకు గురైతే ముందుగా స్పందించిన వ్యక్తి సుకుమార్‌ అని, రాజోలు నియోజకవర్గం మొత్తం ఆయన వెనుక ఉందన్నారు.


సుకుమార్‌ మాట్లాడుతూ చిన్ననాడు తనకు పాఠశాలలో పాఠాలు చెప్పిన గురువులను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి తిరుపతిరావునాయుడు తన కుటుంబానికి చిన్న కష్టం కూడా రాకుండా పెంచి పెద్ద చేశారని గుర్తు చేసుకున్నారు. తాను 1996-97 సమయంలో సినిమా రంగంలోకి ప్రవేశిస్తానని తన తండ్రితో అంటే తన అభీష్టానికి కాదనక చెప్పకుండా తన కుటుంబానికి ఏమైనా కష్టాలు వస్తాయనే ముందుచూపుతో మరునాటి నుంచి తాను పూర్వం నుంచి చేసే బియ్యం వ్యాపారాన్ని మరలా మొదలుపెట్టిన ఘనుడు అన్నారు. తండ్రి తన జీవితంలో ఒక భాగమని, మంచి అవకాశం కల్పించిన నా కుటుంబం, నా తల్లిదండ్రులు, ఈ గ్రామాన్ని ఎన్నడూ మరువనన్నారు. నేను ఏ ప్రాంతంలో ఉన్నా మట్టపర్రు అంటే ఎనలేని ప్రేమ అని, మట్టి వాసనలు, చిన్ననాటి జ్ఞాపకాలు మరువలేనివన్నారు. సుకుమార్‌ తాను చదివిన పాఠశాలలో బల్లపై కూర్చుని కొంతసేపు గడిపారు. తొలుత గ్రామస్తులు సుకుమార్‌ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ పాఠశాల వద్దకు  తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, ఎంఈవో విజయశ్రీ, కంకటాల చంద్రశేఖర్‌, బండ్రెడ్డి బ్రదర్స్‌, కడలి నాగేశ్వరరావు, బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T06:34:10+05:30 IST