Abn logo
Oct 20 2020 @ 04:39AM

సినిమా కామ్రేడ్స్‌..

Kaakateeya

తెలుగు చిత్రపరిశ్రమలో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు, పోరుబాట పట్టే  విప్లవ చిత్రాల హవా  మళ్లీ  మొదలైంది. గతంలో ఈ తరహా  చిత్రాలు చాలా రూపుదిద్దుకొన్నాయి. అయితే  మారిన  ట్రెండ్‌ వల్ల విప్లవాత్మక చిత్రాలు  కనుమరుగయ్యాయి.  ఇప్పుడు  నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాలను పరిశీలిస్తే ఆ ట్రెండ్‌ మొదలైందనిపిస్తోంది.  అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దాం...


చరిత్రను చాటిచెప్పే కథలకు తెరపై ఎప్పుడూ ప్రాముఖ్యం ఉంటుంది. అలాగే సామాజిక సమస్యల గురించి, సమకాలీన  రాజకీయాల గురించి, ప్రజా ఉద్యమాల గురించి వచ్చే చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. గతంలో కృష్ణ ‘ఎన్‌కౌంటర్‌’, మోహన్‌బాబు ‘అడవిలో అన్న’, దాసరి నారాయణరావు ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘స్వర్ణక్క’, ‘సిందూరం’, ‘విరోధి’, ‘జల్సా’, ‘దళం’ వంటి ఉద్యమ నేపథ్య చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై నటుడు, నిర్మాత, దర్శకుడు  ఆర్‌.నారాయణమూర్తి కామ్రేడ్‌ సెంట్రిక్‌ చిత్రాలకు టార్చ్‌ బేరర్‌ అనే చెప్పాలి. మూడు దశాబ్దాలుగా నారాయణమూర్తి ‘ఎర్రసైన్యం’, ‘చీమలదండు’, ‘దండోరా’ వంటి చిత్రాలు 25కు పైగా తెరకెక్కించారు. ఈతరం తెలుగు హీరోలు కూడా ఆ తరహా పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. సవాల్‌ విసిరే ఇటువంటి పాత్రలు పోషించడానికి స్టార్‌ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కామ్రేడ్స్‌గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. 


కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి మాజీ మావోయిస్ట్‌గా నటిస్తున్నారు. ఇందులో న్యాయం, ధర్మం కోసం పోరాడే వ్యక్తిగా చిరంజీవి కనిపిస్తారు. ఆ పాత్ర సమాజాన్ని ప్రభావితం చేస్తుందనీ, ప్రస్తుత సమాజానికి ఆ పాత్ర ఓ స్ఫూర్తిగా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆనాటి స్వాతంత్య్ర యోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలను కూడా తెరపై చూడబోతున్నాం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఈ తరహా పాత్రల్లో చూడబోతున్నాం. 


ఆ పోలిక లేకుండా...

రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాట పర్వం’ విప్లవ నేపథ్యమున్న చిత్రమే. అయితే దర్శకుడు మాత్రం గతంలో వచ్చిన నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు, ఈ చిత్రానికీ  పోలిక ఉండదని  చెబుతున్నారు. నక్సలిజాన్ని ప్రమోట్‌ చేయడం తన ఉద్దేశం కాదనీ, వామపక్ష భావాజాలంతో సోషియో పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని వేణు చెబుతున్నారు. ఇందులో రానా విప్లవ నాయకుడిగా కనిపిస్తారు. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర భారతక్క. ఆ పాత్రను ప్రియమణి పోషిస్తున్నారు. ‘ఒసేయ్‌ రాములమ్మ’లో విజయశాంతి, ‘స్వర్ణక్క’లో రోజా తుపాకీ  పట్టి పోరాటం చేసినట్లుగా ప్రియమణి భారతక్క పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఇది సవాల్‌ విసిరే పాత్ర  కావడంతో  ప్రియమణి ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు. 


ఫైర్‌బ్రాండ్‌లా.. 

ఈతరానికి బ్రాండ్‌గా మారిన విజయ్‌ దేవరకొండ గత ఏడాది ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటించారు. అందులో కాలేజ్‌ క్యాంపస్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే ఫైర్‌బ్రాండ్‌ యంగ్‌స్టర్‌గా కనిపించారు. సందీప్‌ మాధవ్‌ కీలకపాత్రలో ‘జార్జ్‌రెడ్డి’ జీవిత కథగా వచ్చిన ‘జార్జ్‌రెడ్డి’ కూడా ఈతరహా చిత్రమే.

Advertisement
Advertisement