Jun 28 2021 @ 21:34PM

‘మా’ ఎన్నికలు: ఎందుకీ హడావిడి?

‘మా’ అధ్యక్ష పదవి కోసం ఎందుకీ పోటీ? 

గ్రూపులుగా డివైడ్‌ కావాలసిన అవసరం ఏముంది?

ఉన్న ఓట్లు ఎన్ని? పోల్‌ అయ్యే ఓట్లు ఎన్ని? 

‘మా’ భవనం నిర్మించడం అంత కష్టమా? 

వేలాది మంది తారలున్న పరిశ్రమలో ‘మా’ సభ్యత్వం ఉన్నది వెయ్యి మందికేనా? 

ఇలాంటి ప్రశ్నలతో సినీ పరిశ్రమకు సంబంధించిన వారితోపాటు సాధారణ ప్రజలు సోషల్‌ మీడియాలో హాస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడో జరిగే ఎన్నికల కోసం ఇప్పుడే ఇంత హడావిడి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మరోసారి సాధారణ ఎన్నికలను తలపించేలా జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు ఉన్నారు.  మరికొందరు కూడా బరిలో దిగి అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల కోసం మూడు నెలల ముందుగానే అభ్యర్థుల హడావిడి మొదలైంది. ఇంత పోటీ మధ్య ఓట్లు చీలి పోతాయని, ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని పలువురు మాజీ సభ్యులు సినీ పెద్దలను కోరుతున్నారు. ఏకగ్రీవం చేయడానికి పోటీ పడుతున్న సభ్యులు అంగీకరించట్లేదని సినీ వర్గాల నుంచి సమాచారం. 

ఓటు వినియోగించుకునేది ఎంతమంది? 

ఇప్పుడు ‘మా’ అసోసియేషన్‌లో ఉన్న సభ్యుల సంఖ్య 900 పైచిలుకు. గత ఎన్నికల సమయానికి 750కు పైగా సభ్యులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 450 నుంచి 470 మధ్య ఓట్లు పోల్‌ అయ్యాయి. మిగిలిన ఓట్లు ఎందుకు వినియోగించుకోలేదు. సాధారణ ఎన్నికల సమయంలో ‘ఓటు హక్కు వినియోగించుకోండి’ అని ఊదరగొట్టే సీనియర్‌, యువ తారలు ‘మా’లో ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవడం లేదు అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. 

ఎన్నికల సమయంలోనే గుర్తొస్తుందా? 

దాదాపు 27 ఏళ్ల చరిత్ర ఉన్న ‘మా’ అసోసియేషన్‌కు ఓ భవనం కట్టలేకపోయారు ఇప్పటి వరకూ పని చేసిన అధ్యక్షులు. ఎలక్షన్లు జరిగే సమయంలోనే ‘మా’ భవనం గుర్తొస్తుందని, ఎలక్షన్లు పూర్తయ్యాక ఆ ఊసే ఉండదని సినీ పరిశ్రమకు చెందినవారే చెవులు కొరుక్కుంటున్నారు విపత్తుల సమయంలో ప్రభుత్వానికి కోట్లు డొనేషన్లు ఇస్తున్న తారలు ఒక్క క్షణం ‘మా’ భవనం గురించి ఆలోచిస్తే ఇప్పటికి ఆ పని ఎప్పుడో పూర్తయ్యేదనీ, యువ హీరోలు తలచుకుంటే భవన నిర్మాణం ఓ సమస్య అన్నా వాదనలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం తాను బరిస్తానని ప్రకటించారు. అయితే అది కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. తాజాగా తాను అధ్యక్ష పదవిని అలంకరిస్తే ‘మా’ భవనం ప్రారంభిస్తానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. అయితే ఈ మాటలన్నీ కార్యరూపం దాల్చుతాయా లేక హామీలకే పరిమితం అవుతాయా అన్నది చూడాలి. 

బల ప్రదర్శన కోసమా..

ఎలక్షన్ల దగ్గరికొచ్చే వరకూ ఎవరూ మాట్లాడదలచుకోలేదని చెబుతూనే వేదికపై చురకలు వేశారు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకముందే గ్రూపులుగా వేదికలెక్కేది బల ప్రదర్శన చూపించడానికేనా? అలాగే ప్రస్తుత ‘మా’ సభ్యులు కూడా ఓ ప్రెస్‌మీట్‌లో నోరుజారి మాట్లాడారు. మాటకు మాట పెరిగి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మున్ముందు వివాదాలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా ఎవరూ మద్దతు పలకకుండానే ‘మా ప్యానల్‌కు ఫలానా వ్యక్తి మద్దుతు ఉంది’ అంటూ మాట్లాడడంతో సభ్యుల్లో గ్రూపిజం మొదలయ్యే అవకాశాలున్నాయి. 

హీరోయిన్లకు సభ్యత్వం ఇవ్వరా? 

తెలుగు చిత్ర పరిశ్రమ మా పుట్టినిల్లు అని చెప్పుకొనే అగ్ర కథానాయికలు ఎంతమందికి ‘మా’లో సభ్యత్వం ఉంది. కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకునే వారంతా లక్ష రూపాయలు రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోలేకపోతున్నారా? లేక అసోసియేషన్‌ పర భాషా కథానాయికలకు సభ్యత్వం ఇవ్వడం లేదా? వందల సంఖ్యలో తారలున్న ఇండస్ట్రీలో కేవలం వెయ్యి లోపే సభ్యులా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.