బహుజన రాజ్యం వచ్చే వరకూ ఉద్యమం

ABN , First Publish Date - 2022-05-15T05:59:35+05:30 IST

తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చేంత వరకు బీఎస్పీ ఉద్యమం ఆగదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

బహుజన రాజ్యం వచ్చే వరకూ ఉద్యమం
యాత్ర ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

జహీరాబాద్‌, మే, 14: తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చేంత వరకు బీఎస్పీ ఉద్యమం ఆగదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం బంగ్లా మీర్జాపుర్‌ గ్రామంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి రావణ్‌ శశికాంత్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన చైతన్య యాత్రను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో పలు పార్టీల నాయకులు యాత్రల పేరుతో ప్రజలకు మోసపూరితమైన ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారని విమర్శించారు. వారిని నమ్మి మోసపోవద్దని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. బీఎస్పీ నాయకులను దొంగలుగా చిత్రీకరించి మంత్రి కేటీఆర్‌ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను చేపట్టిన యాత్రలో సీఎం కేసీఆర్‌ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని కేసీఆర్‌ రాష్ట్రంలోని 18 లక్షల మంది దళితులకు దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, రాజ్యాంగాన్ని మార్చి దళితులను ఇబ్బందులకు గురి చేసే ఆలోచన చేస్తున్నాయని మండిపడ్డారు. బహుజన రాజ్యం కోసం కాన్షీరాం కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేసిన సైకిల్‌ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని బీఎస్పీ నాయకులు బహుజన చైతన్య యాత్రను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాన్షీరాం చెప్పిన మాదిరిగానే ‘ఓటు హమారా.... రాజ్య్‌ తుమారా... నహీ చలేగా’ అనే నినాదం యాత్రలో ప్రజలకు తెలియజేయాలన్నారు. బీఎస్పీ నాయకులు ప్రతీ గ్రామం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చోవాలన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో నిమ్జ్‌ పేరిట సామాన్య ప్రజల భూములను దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులు అక్రమంగా సంపాదించిన వేల ఎకరాల భూముల్లో నిమ్జ్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి 60 నుంచి 70 శాతం బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. దమ్ముంటే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వారు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని ప్రవీణ్‌కుమార్‌ సవాలు విసిరారు. అంతకు ముందు మండలంలోని దిగ్వాల్‌ గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జహీరాబాద్‌ మండలం రాయిపల్లి గ్రామ చౌరస్తా వద్ద బీఎస్పీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, జిల్లా అధ్యక్షుడు సతీష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలయ్య, జిల్లా కార్యదర్శులు శశికాంత్‌, అలెగ్జాండర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, జహీరాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T05:59:35+05:30 IST