‘అమ్మనబోలు’పై కదలిక

ABN , First Publish Date - 2022-08-18T05:28:49+05:30 IST

అమ్మనబోలును మండలంగా మార్చే అంశంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. గట్టుప్పల్‌ తరహాలో అమ్మనబోలును కూడా మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో మూడు వారాలుగా మండల సాధన సమితి నేతలు రోజుకోరీతిలో దీక్షలు కొనసాగిస్తూ తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు

‘అమ్మనబోలు’పై కదలిక
అమ్మనబోలును మండలంగా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన మండల సాధన సమితి నేతలు (ఫైల్‌)

రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిడి 

పంచాయతీల తీర్మానాలను కోరిన ఎమ్మెల్యే

మంత్రి సహకారంతో సీఎం వద్దకు ప్రతిపాదన

నార్కట్‌పల్లి, ఆగస్టు 17: అమ్మనబోలును మండలంగా మార్చే అంశంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. గట్టుప్పల్‌ తరహాలో అమ్మనబోలును కూడా మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో మూడు వారాలుగా మండల సాధన సమితి నేతలు రోజుకోరీతిలో దీక్షలు కొనసాగిస్తూ తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. అమ్మనబోలు గ్రామ సర్పంచ్‌ బద్దం వరలక్ష్మీరాంరెడ్డితోపాటు మండల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రతిపాదిత  గ్రామాల సర్పంచ్‌లు అధికార పార్టీకి చెందిన వారే అయినప్పటికీ ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో సమానంగా దీక్షలో పాల్గొంటున్నారు. ప్రజాభీష్టానికి విరుద్దంగా వెళ్తే రాజకీయంగా నష్టం తప్పదని గ్రహించే అందుకు అనుగుణంగా వారు దీక్షల్లో పా ల్గొంటూ ఇదే విషయాన్ని పార్టీ నియోజకవర్గ పెద్దలకు కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. పైగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అమ్మనబోలు మండల సాధన దీక్షలకు మద్దతు తెలిపి సం ఘీభావం ప్రకటించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా అమ్మనబోలులో జరిగిన ప్రజాసంగ్రామ పాదయాత్ర బహిరంగసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు తరహాలో నకిరేక ల్‌ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక వస్తేనే అమ్మనబోలు మండలంగా ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఇది నిజమనేలా సోషల్‌ మీడియాలో కొందరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలం టూ పోస్ట్‌లు పెడుతూ ఒత్తిడి తెస్తున్నారు.  


స్పందించిన ఎమ్మెల్యే

అమ్మనబోలు విషయంలో రాజకీయంగా నష్టం వాటిల్లకముందే నివారణ చర్యలకు ఎమ్మెల్యే చొరవ చూపినట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో అమ్మనబోలులో జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమా ల్లో ఇదే మండలానికి చెందిన జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో కలిసి హాజరైనప్పుడల్లా స్థానికుల నుంచి మండల ప్రస్థావన వచ్చినపుడల్లా సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానంటూ ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచా రం. అమ్మనబోలును మండలంగా ఇచ్చేది మనమే..., తెచ్చేది మన మే... అంటూ అధికారపార్టీ నేతల వద్ద ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అమ్మనబోలు మండలంగా ఏర్పడితే ఇందులో కలిసే(14)  గ్రామ పంచాయతీల తీర్మానాలను తన వద్దకు తేవాలని మండల సాధన సమితి కీలక నేతకు చెప్పినట్లు తెలిసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఇదే అంశంపై త్వరలో సీఎంను కలిసి అమ్మనబోలు మండల ప్రతిపాదనలను అందజేసి కొత్త మండలంగా ప్రకటించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కాగా మండల ఏర్పాటుపై కదలిక రావడంతో మండల సాధన సమితి నేతలు ఆశాభావంతో ఉన్నారు.


అమ్మనబోలును మండలంగా చూడాలి.. దీక్షలో పాల్గొన్న వృద్ధుల ఆవేదన

మేం బతికుండగానే అమ్మనబోలును మండలంగా చూడాలన్నదే మా కోరిక....ఆవేదన అని వృద్ధులు అన్నారు. అమ్మనబోలును మండలంగా ఏర్పాటుచేసి నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలనే ప్రధాన ఎజెండాతో అమ్మనబోలు మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 25వ రోజుకు చేరాయి. గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు దీక్షలో కూర్చున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మేం అడిగిన అమ్మనబోలును మండలంగా ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం మేం బతికుండంగనైనా మండలంగా మార్చాలని అది చూసి మేము సంతోశించాలని వారు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు.

నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలి  

అమ్మనబోలును నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ నల్లగొండ జిల్లాలోనే చేర్చాలని తేల్చి చెబుతున్నారు. మండలంగా ఏర్పాటు చేస్తే తక్కువ మండలాలున్నాయనే భౌగోళిక కారణంతో యాదాద్రి జిల్లాలో చేర్చవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మండ ల సాధన సమితి నేతలు స్పందించారు. ఖచ్చితంగా అమ్మనబోలును నల్లగొండ జిల్లాలోనే చేర్చాలని యాదాద్రిలో చేర్చితే అమ్మనబోలు మండలంగా ఏర్పాటైనా ఉపయోగం ఉండదని వాదిస్తున్నారు. పైగా అమ్మనబోలు మండలంలో కలిసే యాదాద్రి జిల్లా కు చెందిన గ్రామ పంచాయతీలు కూడా నల్లగొండ జిల్లాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-18T05:28:49+05:30 IST