వరద ముంపుతో అధికారుల్లో కదలిక

ABN , First Publish Date - 2021-09-29T06:46:01+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ బీభత్సం కారణంగా నగరంలో పలుప్రాంతాలు వరదనీటిలో మునిగిపోవడంతో అధికారుల్లో చలనం వచ్చింది.

వరద ముంపుతో అధికారుల్లో కదలిక
హనుమంతవాక వద్ద డ్రైనేజీలో పూడిక తీస్తున్న సిబ్బంది

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజోతి): గులాబ్‌ తుఫాన్‌ బీభత్సం కారణంగా నగరంలో పలుప్రాంతాలు వరదనీటిలో మునిగిపోవడంతో అధికారుల్లో చలనం వచ్చింది. వర్షపు నీరు సజావుగా గెడ్డల ద్వారా సముద్రంలోకి చేరిపోయేందుకు వీలుగా డ్రైనేజీలను సిద్ధం చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. యంత్రాలతో ప్రధాన డ్రైనేజీల్లో పూడికను తొలగించడం, డ్రైనేజీలో నీటిప్రవాహానికి అడ్డుగా పడిపోయిన చెట్లు, ఇతర వస్తువులను పక్కకు తీయడం చేశారు. హనుమంతవాక కూడలి వద్ద సింహగిరిపై నుంచి వచ్చిన నీటిని గెడ్డలోకి పంపేందుకు వీలుగా జాతీయరహదారికి అనుకుని నిర్మించిన డ్రైనేజీ పూర్తిగా మట్టితో మూసుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో జాతీయరహదారి చెరువుని తలపించింది. దీంతో ముంపునకు కారణం ఏమిటనే దానిపై దృష్టిసారించిన జీవీఎంసీ అధికారులు కొండవైపు డ్రైనేజీ పూర్తిగా మట్టితో కప్పుకుపోయినట్టు గుర్తించి, మంగళవారం ఉదయం ఎక్సకవేటర్‌ సహాయంతో మట్టిని తొలగించారు. అలాగే ఎర్రిగెడ్డలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో పోర్టు వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీని వల్ల వర్షపు నీరు పైకితిరిగి ప్రవహించడంతో వన్‌టౌన్‌, జ్ఞానాపురం వంటిప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో జీవీఎంసీ అధికారులు గెడ్డలోని వ్యర్థాలను ఎక్సకవేటర్‌ సహా యంతో తొలగించి గెడ్డలోని నీరు సులభంగా సముద్రంలోకి వెళ్లిపోయే లా చర్యలు చేపట్టారు. నగరంలోని ఇతర ప్రధాన గెడ్డల్లో కూడా వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా పూడికతీత పనులు చేపట్టారు.

Updated Date - 2021-09-29T06:46:01+05:30 IST