సిక్కోలు నుంచే ఉద్యమం

ABN , First Publish Date - 2020-12-03T05:06:06+05:30 IST

వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం విద్యుత్‌ మీటర్లు అమర్చితే ఉద్యమం చేపడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ హెచ్చరించారు. మీటర్ల బిగింపునకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్న శ్రీకాకుళం నుంచే ఈ ఉద్యమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో శైలజానాథ్‌ మాట్లాడారు.

సిక్కోలు నుంచే ఉద్యమం
కార్యక్రమంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

 మీటర్లు అమర్చితే పోరు తప్పదు

 సీఎం జగన్‌వి తప్పుడు నిర్ణయాలు

 మంత్రులు, ఎమ్మెల్యేలు చేతకానివారు

 పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ 

గుజరాతీపేట, డిసెంబరు 2: వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం విద్యుత్‌ మీటర్లు అమర్చితే ఉద్యమం చేపడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ హెచ్చరించారు. మీటర్ల బిగింపునకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్న శ్రీకాకుళం నుంచే ఈ ఉద్యమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలు, పంపుసెట్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నగరంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో శైలజానాథ్‌ మాట్లాడారు. ‘డిస్కమ్‌లను విక్రయించేందుకే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించింది. మీటర్ల అమరిక, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యాప్తంగా రైతుల నుంచి సంతకాలు సేకరణ  చేపట్టింది. ఒక్క ఏపీ నుంచే ఐదు లక్షల సంతకాలు సేకరించాం. ఇందులో శ్రీకాకుళం జిల్లా నుంచి 8 వేల సంతకాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రోజుకొక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. దీనిపై చేతకాక మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి వెళ్లి ఏం చేస్తారో అర్థం కావడం లేదు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏమి ప్రయోజనం? వీరందరికీ టీఏ, డీఏలు దండగ. వ్యవసాయ బిల్లులు, విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకించాల్సింది పోయి, వాటిని ఆమోదిస్తూ మద్దతు పలకడం సిగ్గుచేటు. ప్రధాని మోదీ మోచేతి కింద సీఎం పని చేస్తున్నారు. అత్యంత బలహీనమైన సీఎంగా  జగన్మోహన్‌రెడ్డి పేరు గాంచారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ప్రజలను అధికారం, కేసులతో భయపెడుతున్నారు. మద్యం దుకాణాలకు కాపలాగా పెట్టి పోలీసుల విలువను ముఖ్యమంత్రి దిగజార్చారు.  విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం సంభవించి ప్రజలు మరణిస్తే పంచాయితీలు నిర్వహించి పరిహారాన్ని అందించారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను అమలు చేశారన్న విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు.’ అని శైలజానాథ్‌ హెచ్చరించారు.  డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అధ్యక్షతన  నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణరావు, సహాయ కార్యదర్శి సొడాడసి సుధాకర్‌,  అధికార ప్రతినిధి వజ్రపతి శ్రీనివాసరావు, రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి బొమ్మిడి గంగాధరరావు, విశాఖ, విజయనగరం కాంగ్రెస్‌ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:06:06+05:30 IST