హైకోర్టు తరలించండి

ABN , First Publish Date - 2021-06-11T08:20:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రీనోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా

హైకోర్టు తరలించండి

  • రీనోటిఫికేషన్‌ ఇచ్చి కర్నూలుకు మార్చండి
  • వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
  • సమతుల్యత కోసమే 3 రాజధానులు
  • రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వండి
  • మెడికల్‌ కాలేజీలకు అనుమతులివ్వండి
  • దిశ బిల్లుకు ఆమోదం తెలపండి
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లుకు కూడా..
  • ఉపాధి, పీడీఎస్‌ బకాయిలు చెల్లించండి
  • అమిత్‌షాకు సీఎం జగన్‌ వినతి


న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రీనోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు హామీ ఇచ్చిందన్నారు. గురువారం రాత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో దాదాపు గంటన్నరపాటు సీఎం సమావేశమయ్యారని ఇక్కడి రాష్ట్ర అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులోని వివరాల ప్రకారం.. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రణాళిక రూపొందించుకున్నట్లు సీఎం తెలిపారు. ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత  సాధించడం కోసమే మూడు రాజధానుల విధానం అమలు చేయబోతున్నాం. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తున్నాం. ఇందులో భాగంగానే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నాం. శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలు చేయబోతున్నాం‘ అని చెప్పారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ర్టానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. భారీ పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే మెడికల్‌ కాలేజీలకు అనుమతులివ్వాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మహానగరాలు లేవని, అందుకనే కొత్తగా 13 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ కాలేజీల ఏర్పాటుతో ప్రభుత్వ రంగంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ, సబ్‌ అర్బన్‌ ప్రాంతాలలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు సమకూరుతాయని అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే 3 కాలేజీలను మంజూరు చేసిందని, మిగిలిన కాలేజీలకూ అనుమతివ్వాలని కోరారు. అలాగే నర్సింగ్‌ కాలేజీలకూ అనుమతి ఇవ్వాలని, ఇందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించాలని కోరారు. 


పీడీఎస్‌ బకాయిలివ్వండి..

ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎ్‌స)లో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రావలసిన రూ.3,229 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అమిత్‌ షాను సీఎం అభ్యర్థించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం చెల్లించాల్సిన రూ.4,652.70 కోట్లను తక్షణమే విడుదల చేయించాలని, సంవత్సరంలో ప్రస్తుతం ఉండే  పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావలసిన బకాయిలు రూ.529.95 కోట్లు ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే ఈ నిధులు విడుదల చేయాలన్నారు.


ఆ విద్యుత్‌ సరెండర్‌..

 విద్యుత్‌ సంస్కరణల్లో ఏపీ ముందంజలో ఉందని, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో కూడా ముందడుగు వేస్తోందని జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగం ఆర్థిక పరిస్థితి బాగులేదని.. సహాయం అందించాలని అమిత్‌షాను కోరారు. కుడిగి, వల్లూరు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్‌ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ కొనుగోలు ధరలు చాలా అధికంగా ఉన్నాయని, 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్‌డ్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. డిస్కంలు ఈ రెండు ప్లాంట్ల నుంచి రాబోయే 40ఏళ్ల దాకా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్నందువల్ల సరెండర్‌ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంల నుంచి రూ. 5,541.78 కోట్ల బకాయిలు రావలసి ఉందని, ఆత్మనిర్బర్‌ ప్యాకేజీకింద తెలంగాణ డిస్కలకు తగిన రుణ సదుపాయం కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు కేంద్రం నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.


రాష్ట్ర విద్యుత్‌ రంగం దాదాపు రూ.50వేల కోట్ల అప్పుల్లో ఉన్నదని, ఈ రుణాలను రీస్ట్రక్చర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా అప్పర్‌ సీలేరులో రివర్స్‌ పంప్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని.. 1,350మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.10,445 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. ఇందులో కేంద్రం 30 శాతం నిధులను సమకూర్చాలని, త్వరితగతిలో పర్యావరణ అనుమతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దిశ బిల్లుకు, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు-2020కి ఆమోదం తెలిపేలా చూడాలన్నారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరినట్లు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-06-11T08:20:19+05:30 IST