Illegal residents: మరో అవకాశం ఇచ్చే యోచనలో కువైత్.. ఉల్లంఘనదారులకు లక్కీ ఛాన్స్!

ABN , First Publish Date - 2022-05-20T14:13:53+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గల కొంతకాలంగా దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Illegal residents: మరో అవకాశం ఇచ్చే యోచనలో కువైత్.. ఉల్లంఘనదారులకు లక్కీ ఛాన్స్!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గల కొంతకాలంగా దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తరచూ తనిఖీలు చేపడుతోంది. ఇక కరోనా కారణంగా పలుమార్లు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు అమ్నెస్టీ(క్షమాభిక్ష) కార్యక్రమాన్ని అమలు చేసిన కువైత్ అధికారులు మరోసారి ఇలాంటి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(PAM) మధ్య కీలక భేటీ జరిగినట్లు తెలుస్తోంది. 


ఈ సందర్భంగా రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి పరిమిత గడువుతో వారి నివాస స్టేటస్ మార్చుకునేందుకు అవకాశం ఇచ్చే విషయమై చర్చించాయని తెలిసింది. అలాగే యజమానుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వారిని కొంత జరిమానాతో దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు వీలు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గతశాఖ మంత్రి షేక్ అహ్మద్ అల్ నవాఫ్ అల్ సభా, న్యాయశాఖ మంత్రి జమాల్ అల్ జలావి, PAM అధికారులు భేటీలో చర్చించారని మీడియా వెల్లడించింది. 


అయితే, ఈ వెసులుబాటును కేవలం ప్రైవేట్ సెక్టార్‌లోని కార్మికులకు మాత్రమే వర్తింపజేయాలనే ప్రతిపాదన ఉంది. ఒకవేళ ఈ అమ్నెస్టీ కార్యక్రమం అమలు చేస్తే ప్రస్తుతం దేశంలో ఉంటున్న 1.50 లక్షల మంది ఉల్లంఘనదారులు తమ రెసిడెన్సీ స్టేటస్‌ను మార్చుకునే వీలు ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల అంతర్గతమంత్రిత్వశాఖ అమలు చేసిన 'లీవ్ సేఫ్' క్యాంపెయిన్ ద్వారా చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న సుమారు 27వేల మందికి లబ్ధి చేకూరింది.   

Updated Date - 2022-05-20T14:13:53+05:30 IST