మెరుపులా.. జంప్‌!

ABN , First Publish Date - 2020-07-08T07:53:44+05:30 IST

అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ఉంచి, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాలని జగన్‌ సర్కారు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ...

మెరుపులా.. జంప్‌!

  • ఏదిఏమైనా  రాజధాని ‘తరలింపు’
  • గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు
  • సీఎంవోతో ప్రారంభం.. ఆపై విశాఖలోనే ‘అధికార’ హడావుడి
  • ఆ తర్వాత కార్యాలయాలన్నీ తరలించే లక్ష్యం
  • అంబేడ్కర్‌ స్మృతివనం మార్పుతో తరలింపుపై విస్పష్ట సంకేతాలు


చట్టానికి చిక్కకుండా, కోర్టులకు దొరక్కుండా, అమరావతిని ‘అలాగే’ ఉంచి... క్రియాశీల రాజధానిని మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాపకింద నీరులా ఈ పనులు ముందుకు  సాగుతున్నాయి. ఉన్నట్టుండి... వీలైతే ఒకే ఒక్కరోజులోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి రైతుల ఆందోళనలు, శాసన సంబంధ అడ్డంకులు, న్యాయ వివాదాలు, కరోనా కేసులు... ఇలా ఏమున్నా సరే, తమ దారి తమదే అన్నట్లుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే...  అమరావతిలో నిర్మించాల్సిన అంబేడ్కర్‌ స్మృతివనాన్ని విజయవాడకు తరలించినట్లు భావిస్తున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ఉంచి, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాలని జగన్‌ సర్కారు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ... మండలిలో బిల్లు గట్టెక్కకపోవడం, హైకోర్టులో కేసులతో ‘పైకి’ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. తెరవెనుక మాత్రం ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి ఒకరు ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించి వచ్చారు. అక్కడ పలు ప్రదేశాలను పరిశీలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం...  కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ భవనంలోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (సీఎంవో) ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.


గత కొన్నాళ్లుగా ఆ ప్రాంతంలో గోప్యంగా పలు రకాల పనులు జరిపిస్తున్నారు. అయితే, సీఎంవోను రుషికొండ మిలీనియం టవర్‌లోని ‘స్టార్టప్‌ విలేజ్‌’లో ఏర్పాటు చేయవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా డీజీపీ గౌతంసవాంగ్‌ కూడా విశాఖకు వెళ్లి కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కార్యాలయంతోపాటు పలు ఇతర భవనాలు, ప్రదేశాలు పరిశీలించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని రుషికొండలో ఉన్న ‘న్యూ నెట్‌’ ఐటీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేయవచ్చునని తెలుస్తోంది. 


సీఎంవోతో మొదలుపెట్టి...

వ్యూహాత్మకంగా సీంఎంవోను విశాఖకు తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు విశాఖ నుంచే ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారంటే ఉన్నతాధికారులు, ఇతర అధికార హడావుడి కూడా అక్కడికి మారినట్లే. ఆతర్వాత వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను తరలించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అంతవరకూ కూడా ఆగకుండా కొన్ని కార్యాలయాలను ఇప్పుడే తరలించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కొందరు శాఖాఽధిపతులు కూడా విశాఖకు గుట్టుగా వెళ్లి తమ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన అద్దె భవనాలను పరిశీలించి వచ్చారని సమాచారం. ఇలా ‘సిగ్నల్‌’ రావడమే ఆలస్యం... అలా  ఫర్నిచర్‌, కంప్యూటర్లు, ఫైళ్లు, ఇతర సామగ్రి అంతటినీ ఆగమేఘాల మీద తరలించేందుకు కసరత్తు జరుగుతోందని కొందరు ఉద్యోగులే పేర్కొంటున్నారు.


స్మృతివనం మార్పుతో... సంకేతం

అంబేడ్కర్‌ స్మృతివనం మార్పు ద్వారా రాజధాని తరలింపునకు ప్రభుత్వం సిద్ధమైందన్న సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో 125 ఎకరాల్లో ఈ స్మృతి వనం నిర్మించాలని గత ప్రభుత్వం  నిర్ణయించింది. ఇప్పుడు... జగన్‌ సర్కారు ఉన్నట్టుండి ఈ స్మృతి వనాన్ని విజయవాడ బందరు రోడ్‌లోని స్వరాజ్‌ మైదానానికి మార్చేసింది. నిర్ణయం తీసుకోవడమే తడవుగా బుధవారం సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనకూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తద్వారా అమరావతిలో ఇక కొత్తగా నిర్మాణాలు ఉండవనే సంకేతాలు ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెప్తున్నారు. రాజధానిగా అమరావతి ఉండబోదనే అంశాన్ని గతం నుంచీ చెప్తున్న ప్రభుత్వం...ఇప్పుడు ఈ సంకేతంతో మార్పుకు రంగం సిద్ధమైనట్లేనని స్పష్టం చేసిందని చెబుతున్నారు.

Updated Date - 2020-07-08T07:53:44+05:30 IST