గురుకులాలను తరలిస్తారా?

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

పాణ్యం మండలంలోని ఏపీ గిరిజన గురుకు ల బాలికల పాఠశాలను ప్రభుత్వం తరలించాలనుకుంటున్నట్లు సమాచారం.

గురుకులాలను తరలిస్తారా?
బలపనూరులోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాల

  1. విద్యార్థులు తగ్గడమే కారణం
  2. జనరల్‌కు కేటాయించాలంటున్న విద్యార్థి సంఘాలు
  3. బాలికల కోసం చెంచుగూడేలకు ఉపాధ్యాయుల పరుగు


పాణ్యం, జూలై 27: పాణ్యం మండలంలోని ఏపీ గిరిజన గురుకు ల బాలికల పాఠశాలను ప్రభుత్వం తరలించాలనుకుంటున్నట్లు  సమాచారం. విద్యార్థినుల హాజరు శాతం తగ్గడమే దీనికి కారణంగా  చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శ్రీశైలం పరిధిలో 1996లో కర్నూలు, నల్గొండ, ప్రకాశం, మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన చెంచు బాలికల కోసం గురుకుల పాఠశాలను మహానందిలో ఏర్పాటు చేసింది. ఇదే పాఠశాలను 2002 జనవరి 9న పాణ్యం మండలం బలపనూరు పరిధిలో ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్మాణానికై పాణ్యం రామస్వామి ఆలయానికి చెందిన 34 ఎకరాల దేవదాయశాఖ భూమిని కొనుగోలు చేసి ఐటీడీఏకు కేటాయించారు. పాఠశాలతోపాటు సిబ్బందికి వసతి గృహాలు కూడా నిర్మించారు. మొదట దాదాపు 600 మంది బాలికలు చదువుకొనేవారు. రాష్ట్ర విభజనతో నల్గొండ, మమబూబ్‌నగర్‌ జిల్లాల బాలికల సంఖ్య తగ్గిపోయింది.  2016లో రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంతాలలోని 80 గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చడంతో బాలికల సంఖ్య మరింత తగ్గింది. దీంతో పాఠశాలను ప్రకాశం జిల్లా దోర్నాలకు తరలించడానికి చర్యలు చేపట్టినట్లు సమాచారం. 


జనరల్‌కు కేటాయిస్తే సీట్లు పెరిగే అవకాశం 

 శ్రీశైలం ఐటీడీఏ ఈ పాఠశాలను కేవలం చెంచు బాలికలకే కేటాయించడంతో సంఖ్యా సమస్య వచ్చిందని, అలా కాకుండా జనరల్‌ ఎస్టీలకు కేటాయిచాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. అప్పుడు ఎరుకలి, సుగాలి, యానాది తదితర చెంచుయేతర గిరిజనులకు కూడా అవకాశం కలుగుతుందని అన్నారు. దీని వల్ల హాజరు పెరుగుతుందని విద్యార్థి సంఘాల నాయ కులు అభిప్రాయపడుతున్నారు.  


రెండేళ్లుగా అందని  కాస్మొటిక్‌ చార్జీలు

 రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు రెండేళ్లుగా కాస్మొటిక్‌ చార్జీలు అందడంలేదు. దీంతో బాలికలు పాఠశాలలో చేరడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  


చెంచు గూడేలకు ఉపాధ్యాయుల పరుగు

 గత నెల ఏపీ గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాలికల సంఖ్య తగ్గుతుందన్న కారణంగా పాఠశాలను ఇక్కడి నుంచి తరలించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొనడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినిల హాజరు శాతం పెంచ డానికి ఉపాధ్యాయులు చెంచుగూడేలకు పరుగులు తీస్తున్నారు. 2002 లో 598 మంది బాలికలు ఉండగా 2009లో జనరల్‌కు కేటాయించడంతో 598 మందికి హాజరు పెరిగింది. 2014లో రాష్ట్ర విభజనతో హాజరు శాతం 325కు తగ్గింది. 2020-21లో 253కు చేరడంతో పాఠశాల తరలింపు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈసమస్య పరిష్కరించ డానికి ఉపాధ్యాయులు బాలికలను పాఠశాలలో చేర్పించే పనిలోకి దిగారు.


తరలించే ప్రసక్తే లేదు

పాణ్యంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలను తరలించే ప్రసక్తే లేదు. పాఠశాలలో బాలికల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపడతాం. రాష్ట్ర గురుకుల కార్యదర్శితో చర్చించి తరలింపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరతాం.  

- కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే 


తరలించేది లేదు

 పాణ్యం వద్దగల ఎస్టీ గురుకుల పాఠశాలను తరలించేది లేదు.  బాలికల సంఖ్య పెంచడానికి పాఠశాల ఉపాధ్యాయులను, సిబ్బందిని చెంచుగూడేలకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదే శించాం. పాఠశాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించే ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర గురుకుల కార్యదర్శితో చర్చించాం. జనరల్‌కు కేటాయిస్తే చెంచుల ఉనికి తగ్గుతుంది. గతంలో ఈ మేరకు పాత జీవోను రద్దు చేశారు. రెండేళ్లుగా మంజూరు కాని కాస్మొటిక్‌ చార్జీలు త్వరలో విడుదలవుతాయి.  

- రవీంద్రారెడ్డి, పీవో, ఐటీడీఏ, శ్రీశైలం




Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST