రాత్రిపూట ఎలుకల బోనులోంచి శబ్దం.. ఏముందో చూసి ఇంట్లోంచి పరుగులు తీసిన కుటుంబం..!

ABN , First Publish Date - 2021-07-11T00:17:30+05:30 IST

ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో.. చికాకు పడిందా కుటుంబం. ఆ ఎలుకలను పట్టుకోవడానికి బోను కొనుక్కొచ్చింది.

రాత్రిపూట ఎలుకల బోనులోంచి శబ్దం.. ఏముందో చూసి ఇంట్లోంచి పరుగులు తీసిన కుటుంబం..!

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో.. చికాకు పడిందా కుటుంబం. ఆ ఎలుకలను పట్టుకోవడానికి బోను కొనుక్కొచ్చింది. రాత్రి పడుకోబోయే ముందు ఎలుకల బోను పెట్టి నిద్రకుపక్రమించింది. అర్థరాత్రి సమయంలో ఆ బోను పడినట్లు ఏదో చప్పుడైంది. దీంతో ఎలుకలు బోనులో చిక్కి ఉంటాయని ఆ కుటుంబం భావించింది. తీరా బయటకు వచ్చి చూస్తే వాళ్ల గుండె ఆగినంతపనైంది. భయంతో ఇంట్లోంచి ఆ కుటుంబ సభ్యులందరూ బయటకు పరుగుతీశారు. ఈ వింత ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.


ఇక్కడి ఏకలింగాపూర్‌లో లక్ష్మణ్ సింహ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ చికాకు పెట్టసాగాయి. దీంతో ఎలుకల బోను కొనుక్కొచ్చిన లక్ష్మణ్.. దాన్ని ఇంటిలో ఒక మూల అమర్చి పడుకున్నాడు. రాత్రి పూట ఆ బోనులో నుంచి చప్పుడు రావడంతో అతనికి, కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చింది. బోనులో చిక్కిన ఎలుకలే ఆ చప్పుడు చేస్తున్నాయని వాళ్లు బావించారు. వెళ్లి ఆ బోను తెరిచి చూస్తే.. నల్లగా నిగనిగలాడుతూ పడగ విప్పి బుసలు కొడుతున్న నల్లతాచు కనిపించింది. 



అంతే ఆ కుటుంబం గుండెలు గుభేలుమన్నాయి. పెద్దగా అరుస్తే బయటకు పరుగు తీశారు. ఆ తర్వాత యానిమల్ రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించారు. దీంతో అక్కడకు చేరుకున్న యానిమల్ రెస్క్యూ టీమ్ సభ్యులు.. చాలా జాగ్రత్తగా బోను తీగలు తెంచి, ఆ పామును తీసుకెళ్లి దగ్గరలోని అడవిలో విడిచిపెట్టారు. వర్షాకాలం రావడంతో అడవి జంతువులు బయటకు వస్తున్నాయని, ఈ క్రమంలోనే ఎలుగుబంట్లు, పాముల వంటి జీవులన్నీ జనావాసాల్లోకి వస్తున్నాయని యానిమల్ రెస్క్యూ సెంటర్ అధ్యక్షుడు చమన్ సింహ్ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే వారితోపాటు వన్యప్రాణులు కూడా సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-11T00:17:30+05:30 IST