జరిమానాల గన్‌

ABN , First Publish Date - 2020-10-23T11:26:54+05:30 IST

జరిమానాల గన్‌

జరిమానాల గన్‌

వాహనదారులూ.. తస్మాత్‌ జాగ్రత్త

 నిబంధనలు అతిక్రమిస్తే భారీ వసూళ్లు

 బెంబేలెత్తిస్తున్న రవాణా శాఖ నూతన చట్టం

 వాహనదారుల జేబులకు భారీగా చిల్లు

 సగటు ఉద్యోగి జీతానికి సమానం

 ఫైర్‌ అవుతున్న జనం.. ప్రభుత్వ దోపిడీ అంటూ మండిపాటు


జిల్లాలో వాహనదారుల జేబులకు ఇకపై భారీగా చిల్లుపడనుంది. ఏ చిన్న నిబంధన ఉల్లంఘించినా అడ్డంగా జరిమానా విధించేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసులు  రెడీ అవుతున్నారు. తాజాగా ప్రభుత్వం విధించే జరిమానాలు ఒక మధ్య తరగతి కుటుంబపు ఆదాయానికి సమానంగా ఉన్నాయి. వందో.. రెండొందల జరిమానాతో బయటపడే వాహనదారులకు.. ఒక్కసారిగా వీటిని వేలల్లో పెంచడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వేస్తున్న జరిమానాలు ప్రజలకు బాధ్యతలు గుర్తు చేసేదిగా కాకుండా, సామాన్యుల జేబులు గుల్ల చయడమే ధ్యేయంగా ఉందని మండిపడుతున్నారు. పరిపాలనంటే సినిమా కాదని.. రగిలిపోతున్నారు. మోటారు వాహన దారులపై భారీగా జరిమానాలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


ఏలూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి):  జిల్లాలో సుమారు 13 లక్షల వాహనాలు ఉన్నా యి. వీటిలో 11 లక్షలు వ్యక్తిగత వినియోగం కోసం వాడుకునే వాహనాలే ఉన్నాయి. కార్లు సుమారు 2 లక్షలు ఉండగా, 6 లక్షల వరకూ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. సామాన్యులు రోజువారీ కుటుంబ అవసరాలకు వాడుకుం టుంటే, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాల పై వ్యాపారం చేసుకుంటూ బతుకుబండి లాగుత్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సెకండ్‌ హ్యాండ్‌లో రూ.10 వేలకో రూ.20 వేలకో వాహ నం కొని వ్యాపారం చేసుకుంటూ కుటుం బాలను పోషించుకుంటున్నారు అలాంటి వారికి ఒక్కసారే రూ.2 వేల నుంచి రూ.10 వేల జరిమానా అంటే బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో 50 వేల ఆటోలు, 20 వేల వరకు క్యాబ్‌లు, కార్లు బాడుగకు నడిపేవారు ఉన్నారు. వీరికీ ఇకపై వేల రూపాయల వాత తప్పదు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలు 12,540 ఉన్నాయి. వీరుగనుక అధికారులకు దొరికితే ఇకపై రెండు నుంచి రూ.5 వేలు చెల్లించాలి. వీటితోపాటు ఆన్‌లైన్‌ కానివి మరో 10,409 ఉన్నాయి. వీరికి కూడా బాదుడు తప్ప దు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు 20 వేలకు పైనే ఉంటాయి. వీరందరికీ ఇకపై వేల రూపాయల వడ్డన తప్పదు.


జిల్లాలో సుమారు 2 లక్షల వరకూ రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో లారీలు, బస్సులు, ఇతర భారీ రవాణా వాహ నాలపై మరింత భారం పడుతోంది. వీటికి 20 నుంచి రూ.40 వేల వరకూ జరిమానా విధిం చే అవకాశాలు ఉన్నాయి. ఓవర్‌లోడ్‌ వేశారో.. ఇక ఆ వాహనాన్ని రక్షించేవారెవరూ లేరు.


ప్రజలను వెంటాడుతున్న భయం

ఇప్పటికే ఉన్న మోటారు వాహన చట్టాలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తాజాగా చేసిన చట్టం పుండు మీద కారంలా తయారైం ది. ఇప్పటికే అధికారుల వేధింపులతో అల్లాడు తున్న ప్రజలు ఈ నిబంధనల పరిశీలనకు ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వేగంగా నడిపారనో, అనవసరంగా హారన్‌ కొట్టారనో ఎలా నిర్ధారిస్తారన్నది వారి సందేహం.ఈ వంకతో ప్రభుత్వం, అధికారులు సామాన్యులను నిలువు దోపిడీ చేస్తారన్న భయం వెంటాడుతోంది. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. 


ఇంత దారుణమా..?- మాండ్రు రాజేంద్ర, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, ఏలూరు 

క్రమశిక్షణ కోసం చట్టం ఉండొచ్చు కానీ ఇంత దారుణంగానా..? ద్విచక్ర వాహనం నేడు నిత్యావసరమైంది. ఇప్పటికే ఉన్న జరిమానాలు చెల్లించడానికి వాహన దారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయలు వేయడం అంటే ప్రభుత్వం అక్రమంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే గాని ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని చేసిన జీవో కాదిది. 


ముందు రోడ్లు వేయండి- ఎస్‌కె షమీర్‌, వాహనదారుడు, ఏలూరు

ఏ రోడ్డు చూసినా అధ్వానంగా ఉంది. టాక్స్‌లు చెల్లిస్తున్నా ఎక్కడా మెరుగ్గా లేవు. సదుపాయాలు కల్పించకుండానే వాహనదారులపై కొత్తచట్టం పేరుతో భారం మోపు తున్నారు. తెలిసో తెలియకో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించవచ్చు. అంతమాత్రాన వేల రూపాయల జరిమానా అంటే నెలంతా కష్టపడ్డ సొమ్ము చెల్లిం చాలా? ఇది చాలా అన్యాయం!


నిబంధనలు అమలు చేయండి- మోరా రామిరెడ్డి, ఆకివీడు

అధికారులు విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. టర్నింగుల్లో గుర్తులు ఉండ వు. రహదారులు, వంతెనలపై రెడ్‌లైట్లు ఉండవు. ఇలాంటివి పట్టించు కోవాలి. భారీ జరిమానాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. అలాగని వాహనదారులపై పడి దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్‌.  


జరిమానాలతో ఇబ్బందులే- గట్టిం రాజు, గణపవరం 

నూతన చట్టంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లుపడుతుంది. ఇప్పటికే రవాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసులు చలానాల మోతలు మోగి స్తున్నారు. నిబంధనలు పాటించక పోతే స్వల్ప జరిమానాలతో బయటపడేవారు. భారీ జరిమానాలతో ఇకపై అధికారులు వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.


అందరిపై భారం తగదు - పాలింపాటి చినబాబు, కొవ్వూరు

నిబంధనలు కఠినతరం పేరుతో అందరిపై భారం మోపడం సరికాదు. ప్రధాన రహదారులు, హైవేపై నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి. రహదారి నిబంధనలను కఠినతరం చేయడం సరైనదే అయినప్పటికి ఈ సమయంలో ప్రజలపై భారం మోపడం ఇబ్బందికరం. నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలి. 


అవగాహన కల్పిస్తున్నాం- సిరి ఆనంద్‌, డీటీసీ, ఏలూరు

నూతన జరిమానాల వల్ల అయినా వాహనదారుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వీడి బాధ్యతగా వాహనాలు నడుపుతారని భావిస్తున్నాం. కొత్త మోటారు వాహన చట్టంపై ప్రజల లో అవగాహన కల్పిస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయి న తరువాతే ఉన్నతాధికారుల ఆదేశాలతో కొత్త జరిమా నాల అమలుకు చర్యలు తీసుకుంటాం.

 

వడ్డన ఇలా..

జరిమానాలను 31 విభాగాల్లో దేనికెంత వసూలు చేయాలో నిర్దేశిస్తూ రవాణా శాఖ జారీ చేసిన జీవో నెం.21 ప్రకారం.. 

 రవాణా, లేదా ట్రాఫిక్‌ పోలీసుల వాహన చెకింగ్‌ 

విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750 

 అడిగిన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే రూ.750

 అనుమతి లేని వ్యక్తికి వాహనం ఇస్తే రూ.5 వేలు

 డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే అర్హత లేని వారికి 

వాహనం ఇస్తే రూ.10 వేలు

 నిబంధనలకు వ్యతిరేకంగా వాహనంలో 

మార్పులు చేస్తే రూ.5 వేలు

 స్పీడ్‌ డ్రైవింగ్‌ రూ.వెయ్యి

 సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే రూ.10 వేలు

 వాహనానికి రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.5 వేలు

 పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు

 ఓవర్‌లోడ్‌ వాహనానికి రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు  

 బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు

 ఎమర్జన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు

 అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి వెయ్యి, రెండోసారి రెండు వేలు

Updated Date - 2020-10-23T11:26:54+05:30 IST