తల్లీకొడుకు ఆత్మహత్య కేసు బాన్సువాడ డీఎస్పీకి బదిలీ

ABN , First Publish Date - 2022-04-18T05:04:59+05:30 IST

అధికార పార్టీ ఆగడాలకు రెండు నిండు ప్రాణాలు బలికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన తల్లీకొడుకు ఆత్మహత్య కేసు దర్యాప్తుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

తల్లీకొడుకు ఆత్మహత్య కేసు బాన్సువాడ డీఎస్పీకి బదిలీ
డీఎస్‌పీ సోమనాఽథ్‌కు వినతి పత్రం అందిస్తున్న ఆర్యవైశ్య సంఘ సభ్యులు

- దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు

- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యసంఘం నాయకుల డిమాండ్‌

- సంతోష్‌ కాల్‌డేటాను సేకరిస్తున్న పోలీసులు

- రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, సీఐ పలుమార్లు ఫోన్‌లు చేసినట్టు గుర్తించిన పోలీసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 17: అధికార పార్టీ ఆగడాలకు రెండు నిండు ప్రాణాలు బలికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన తల్లీకొడుకు ఆత్మహత్య కేసు దర్యాప్తుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతికి గల కారణాలు, నెలల తరబడి గంగం సంతోష్‌ను వేధింపులకు గురిచేయడంతో పాటు ప్రజలు కడుతున్న పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజారక్షణకు పని చేయాల్సిన ఓ పోలీసు అధికారి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై సోషల్‌ మీడియా వేదికగా గంగం సంతోష్‌ పంచుకోవడంతో అతని కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుని మృతికి కారణమైన రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కిందిస్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా పట్టించుకోకపోవడంతో తనకు ఈ జిల్లాలో ఏ మాత్రం న్యాయం జరగదని భావించి కామారెడ్డి జిల్లాలో తన అక్క, బావల కుటుంబం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా లాడ్జిలో రూమ్‌ తీసుకుని ఉండి 5 రోజుల పాటు తీవ్ర మనోవేదనను అనుభవించినట్లు తెలుస్తోంది. ఇంట్లో వారికి తన బాధను చెప్పుకోలేక తన కన్నతల్లితో మాత్రం తన ఆవేదనను చెప్పుకుని ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవడం, కన్న కొడుకు లేకపోతే తాను బతికుండి నరకం అనుభవించే కంటే తాను సైతం అతని వెంటే వెళ్లిపోవాలని నిర్ణయించుకుని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహరాజ లాడ్జిలో శనివారం ఆత్మహత్య చేసుకున్న రామాయంపేటకు చెందిన గంగం సంతోష్‌, గంగం పద్మ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసును బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డికి అప్పగించారు. అతని నేతృత్వంలో మూడు బృందాలు ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు.  రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ సరాప్‌ యాదగిరి, అప్పటి సీఐ నాగార్జునగౌడ్‌లు పలుమార్లు మృతుడు సంతోష్‌ సెల్‌ఫోన్‌కు ఫోన్‌లు చేసినట్లు సంతోష్‌ కాల్‌డేటాను సేకరించిన పోలీసులకు వివరాలు లభించాయి. ఎందుకు అంతలా కాల్‌ చేశారనే దానిపై అటు సీఐ నాగార్జునగౌడ్‌తో పాటు పరారీలో ఉన్న 6 గురు నిందితుల వివరాలు రాబట్టే క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి కాల్‌డేటా ప్రకారం ఎన్ని నిమిషాలు, ఎన్నిసార్లు సంతోష్‌తో మాట్లాడారు అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక పోలీసులపై ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే బాన్సువాడ డీఎస్పీకి ఈ కేసును అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా సంతోష్‌ ఆరోపించిన ఏడుగురిపై ఇప్పటికే 306 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. ఏ1గా మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, ఏ2గా ఏఏంసీ చైర్మన్‌ సరాప్‌ యాదగిరి, ఏ3గా పృథ్వీరాజ్‌, ఏ4గా తోట కిరణ్‌, ఏ5గా కృష్ణగౌడ్‌, ఏ6గా స్వరాజ్‌, ఏ7గా అప్పటి రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌లను చేర్చారు.


ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతి

సంతోష్‌, పద్మ ఆత్మహత్యలకు కారణమైన రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌, ఏఎంసీ చైర్మన్‌తో పాటు మరో 5 గురిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం కామారెడ్డి డీఎస్పీ సోమనాథంను కలిసి వినతి పత్రం అందించారు. అధికార పార్టీ అండతో అన్యాయంగా వ్యాపారి సంతోష్‌ను, వారి కుటుంబ సభ్యులను టార్చర్‌ చేసి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పార్టీలకతీతంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు డీఎస్పీని కలిసి విన్నవించారు. తల్లీకొడుకు ఆత్మహత్య కేసుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫోన్‌ ద్వారా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి కేసును తప్పుదోవ పట్టించుకుండా పోలీసులు వ్యవహరించాలని కోరినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సైతం వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి దైర్యం చెప్పినట్లు సమాచారం. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డీజీపీకి కోరినట్లు తెలుస్తోంది.

కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు

కక్ష పూరితంగా వ్యవహరించి అతని ఆత్మహత్యకు కారణమైన  రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాప్‌ యాదగిరిలతో పాటు సీఐ నాగార్జునగౌడ్‌ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా వ్యవహరిస్తే కేసు నుంచి తప్పించుకోవచ్చనే ఓ న్యాయవాది సలహాలతో ఎత్తులను వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నిందితుల ఫోన్‌లు స్విచ్చాఫ్‌లో ఉంచి పరారీలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఽధికార పార్టీ నేతలు ఈ ఆత్మహత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉండడంతో జిల్లాలోని అధికారపార్టీలో సైతం తీవ్ర చర్చసాగుతోంది. స్వప్రయోజనాల కోసం పార్టీని వాడుకోవడమే కాకుండా ఓ అధికారితో ఈ తరహ వ్యవహారాలు నడపడంపై పార్టీ సీరియస్‌గా ఉందని సమాచారం. పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని వెనకేసుకొని వస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని ఉద్దేశ్యంతోనే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మెదక్‌ ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చి తప్పకుండా బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబీకులకు చెప్పడంతో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో వారిని గుర్తించి అరెస్టు చేయాలనే సంకల్పంతో పోలీసులు మూడు బృందాలుగా గాలిస్తున్నారు.

Updated Date - 2022-04-18T05:04:59+05:30 IST