Abn logo
May 18 2021 @ 11:50AM

నిలోఫర్‌ ‘దేవుళ్ల’కు కృతజ్ఞతలు చెబుతూ ఓ తల్లి లేఖ

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : ఆపత్కాలంలో నిలోఫర్‌ వైద్యులు అందించిన సేవలకు ఓ తల్లి కృతజ్ఞత వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదర్‌గూడ చింతలమెట్‌ ప్రాంతానికి చెందిన హస్మాబేగం(28)కు గత నెల 23న నెలలు నిండడంతో మొదటి కాన్పు నిమిత్తం నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెకు 13 ఏళ్లుగా ఆస్తమా ఉంది. ప్రసవం సమయంల్లో ఇబ్బందులు వస్తాయని వైద్యులు ముందే సూచించారు. ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అదే రోజు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ నార్మల్‌ డెలివరీ కోసం దాదాపు ఆరుగురు వైద్యుల బృందం గర్భిణి వద్దే ఉన్నారు. అనుక్షణం ఆమె బాగోగులు చూస్తూ సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించారు. చివరి క్షణంలో శస్త్రచికిత్స ద్వారా ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. రెండున్నర కిలోలు ఉన్న బాబుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే బాబును ఎన్‌ఐసీయూలోకి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మూడు రోజుల తర్వాత హస్మాబేగంను డిశ్చార్జ్‌ చేసినప్పటికీ బాబును ఆస్పత్రిలోనే ఉంచి చికిత్సలు అందించారు. ఏడు రోజుల పాటు బాబుకు చికిత్సలు అందించి గత నెల 30న డిశ్చార్జ్‌ చేశారు. వారే స్వయంగా ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు.

కుటుంబసభ్యుల లేఖ

బాబుకు తల్లి అవసరం లేకుండానే ఏడు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు వైద్యులు. వారి సేవలను కొనియాడుతూ హస్మా బేగం, ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి లేఖ రాశారు. ‘నిలోఫర్‌  దేవుళ్లను ఎన్నటికీ మరువలేం. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ఆ లేఖలో రాశారు. ప్రస్తుతం ఆ లేఖ ఆస్పత్రిలోని వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి పంపిన వైద్యులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ జ్యోతి ప్రత్యేకంగా అభినందించారు.


వైద్యులు కన్నతల్లిలా చూసుకున్నారు

అత్యవసర పరిస్థితిలో మొదటి కాన్పునిమిత్తం ఆస్పత్రికి వచ్చాను. ఆరు గంటల పాటు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పారు వైద్యులు. బాబును ఏడు రోజుల పాటు కన్నతల్లి అవసరం లేకుండానే జాగ్రత్తగా చూస్తున్నారు. వారికి రుణపడి ఉంటాం. వారి సేవలను మరువలేను. అందుకే లేఖ రాశాం. - హస్మా బేగం


85 శాతం ఈజీగా కోలుకుంటారు..

మానసికంగా ధైర్యంగా ఉంటేనే కొవిడ్‌ నుంచి త్వరగా బయటపడే అవకాశముంటుంది. చాలా మంది పాజిటివ్‌ రాగానే ఒత్తిడికి గురవుతున్నారు. వారిలో అనారోగ్యసమస్యలు పెరిగే అవకాశముంది. ఏమవుతుందోననే భయం చాలా మందిలో కనిపిస్తోంది. అవసరం లేకపోయినా కొంతమంది అస్పత్రిలో చేరేందుకు పోటీపడుతున్నారు. కరోనా సోకిన వాళ్లు శారీరక శ్రమ లేకుండా విశ్రాంతి తీసుకుంటూ డాక్టర్లు ఇచ్చిన మందులు వాడితే త్వరగా కోలుకోవచ్చు. మానసిక ఒత్తిడితో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొవిడ్‌ బారిన పడిన వారిలో 85 శాతం మంది ఈజీగానే కోలుకుంటున్నారు. నాలుగైదురోజులు ఆయాసం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ప్రధాన సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లాలి. - డాక్టర్‌ రమేష్‌ గుడపాటి, స్టార్‌ ఆస్పత్రి.Advertisement