మాతృ భాష వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-22T06:26:59+05:30 IST

ఏజెన్సీలో మాతృ భాష విద్యా వలంటీర్ల సమస్యలను అధికారులు పరిష్కరించాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు డిమాండ్‌ చేశారు.

మాతృ భాష వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న గంగరాజు, మోకాళ్లపై నిల్చుని నిరసన తెలుపుతున్న మాతృ భాష వలంటీర్లు


అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు డిమాండ్‌ 


పాడేరు, జనవరి 21: ఏజెన్సీలో మాతృ భాష విద్యా వలంటీర్ల సమస్యలను అధికారులు పరిష్కరించాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ కార్యాలయం ముందు విద్యా వలంటీర్ల రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృ భాష వలంటీర్లను ఈ ఏడాది రెన్యువల్‌ చేయకపోవడంతో మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ బాలలకు మాతృ భాషలో బోధనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మాతృ భాష వలంటీర్లు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, ఉపాధ్యక్షుడు కొర్రా నర్సయ్య, వలంటీర్లు కృష్ణారావు, నూకరాజు, మత్స్యరాజు, రామ్మూర్తి, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 


మాతృ భాష బోధనను పునరుద్ధరించాలి

చింతపల్లి, జనవరి 21: మాతృ భాష విద్యా వలంటీర్లను వెంటనే రెన్యువల్‌ చేసి, మారుమూల గ్రామాల్లో గిరిజన చిన్నారులకు మాతృ భాషలో విద్యాబోధనను పునరుద్ధరించాలని ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు. మాతృ భాష వలంటీర్ల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యా వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్‌ పాల్గొన్నారు. 


ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు, జనవరి 21: తమను రెన్యువల్‌ చేసే వరకు రిలే దీక్షలను విరమించేది లేదని మాతృభాష విద్యా వలంటీర్లు స్పష్టం చేశారు. మూడు నెలల నుంచి వివిధ రూపాల్లో  ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. రెండో రోజు దీక్షలో    కె. త్రినాథ్‌, ఎం.ఎం.శ్రీను, కె.కొండయ్య, కె.గణేశ్వరరావు, వి.చంద్రయ్య, వి.రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T06:26:59+05:30 IST