1000 మంది బిడ్డల తల్లి ఇక లేరు

ABN , First Publish Date - 2022-01-05T17:48:37+05:30 IST

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ

1000 మంది బిడ్డల తల్లి ఇక లేరు

ముంబై : ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. 


శస్త్ర చికిత్స, గుండె పోటు

గత ఏడాది నవంబరు 24న సింధుతాయ్‌కి లార్జ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా శస్త్ర చికిత్స జరిగింది. అప్పట్లో ఆమె కోలుకున్నారు. కానీ ఓ వారం క్రితం ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం ఆమె తీవ్రమైన గుండె పోటుతో బాధపడ్డారు. ఆమెను పుణేలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ చికిత్స చేశారు. మంగళవారం రాత్రి 8.10 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్దివ దేహాన్ని మంజిరి ఆశ్రమంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 



బాల్యం నుంచి అనేక కష్టాలు

సింధుతాయ్ 1948 నవంబరు 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు. ఆమె నాలుగో తరగతి చదివారు. ఆమెకు పదేళ్ళ వయసులో 40 సంవత్సరాల వయసుగల వరునితో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె వార్ధాలోని నవర్‌గావ్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే ఆమె గర్భవతిగా ఉన్నపుడు ఆ ఊరిలోని భూస్వామి ఆమెపై వదంతులు ప్రచారం చేశారు. దీంతో ఆమెను ఆమె భర్త వదిలిపెట్టారు. ఆమె కుటుంబీకులు ఆమెను రానివ్వలేదు. ఆమె కులం ఆమెను బహిష్కరించింది. ఆమె ఓ పశువుల పాకలో తన బిడ్డకు జన్మనిచ్చారు. 


పాటలు పాడుతూ జీవనోపాధి

రైళ్ళలో భిక్షాటన చేస్తూ, పాటలు పాడుతూ ఆమె జీవనోపాధి పొందారు. ఆ సమయంలో తల్లి అవసరమైన పిల్లలు అనేక మంది ఉన్నట్లు ఆమె గమనించారు. అప్పటి నుంచి ఆమె అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. సన్మతి బాల నికేతన్ సంస్థ పేరుతో ఓ అనాథాశ్రమాన్ని పుణేలోని హడప్సర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1,000 మందికిపైగా బాలలను ఆమె దత్తత తీసుకున్నారు. 


వందలాది పురస్కారాల గ్రహీత

ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఆమెకు దాదాపు 750కి పైగా పురస్కారాలు లభించాయి. ఆమెను భారత ప్రభుత్వం 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆమెను అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారంతో సత్కరించింది. 



ఆమె జీవితం సుదీర్ఘ చరిత్ర : రామ్‌నాథ్ కోవింద్

వందలాది మంది అనాథలకు అండగా నిలిచి, వారిని పోషించడంతోపాటు మహిళల పునరావాసం కోసం విశేషంగా కృషి చేసిన సింధుతాయ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, డాక్టర్ సింధుతాయ్ సప్కల్ జీవితం ధైర్యసాహసాలు, అంకితభావం, సేవలకు సంబంధించిన ప్రేరణనిచ్చే సుదీర్ఘ చరిత్ర అని తెలిపారు. ఆమె అనాథలు, గిరిజనులు, అణగారిన వర్గాలవారిని ఎంతో ప్రేమించి, సేవ చేశారని పేర్కొన్నారు. ఆమెను 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించినట్లు తెలిపారు. అద్భుతమైన దృఢ నిశ్చయంతో ఆమె తన చరిత్రను లిఖించుకున్నారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆమెను అనుసరించేవారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. 


ఎప్పటికీ గుర్తుండిపోతారు : మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, సింధుతాయ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె గొప్ప కృషి చేశారన్నారు. ఆమె మరణం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆమెను అభిమానించేవారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతూ, ఓం శాంతి అని పేర్కొన్నారు. 


తల్లిలాంటి సంరక్షణనిచ్చారు : ఉద్ధవ్ 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ, సింధుతాయ్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. వేలాది మంది అనాథ బాలలకు ఆమె తల్లిలాంటి సంరక్షణను అందజేశారని పేర్కొన్నారు. ఆమె ఆకస్మిక మరణం వల్ల సామాజిక సేవా రంగం ఓ స్ఫూర్తిదాయక వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


భావి తరాలకు స్ఫూర్తిదాయకం : శరద్ పవార్

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ, సింధుతాయ్ చేసిన సామాజిక సేవ రానున్న తరాలను ప్రేరేపిస్తుందని, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. 


ఎన్నో కష్టాలకు ఎదురొడ్డిన ధీర వనిత : అశోక్ చవాన్

మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పందిస్తూ, సింధుతాయ్ స్వయంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె అనాథలు, వదిలివేయబడిన బాలల అభివృద్ధి కోసం నిరంతరం, అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. ఆమె జీవితం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. 


ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కూ యాప్ ద్వారా సింధుతాయ్ మృతికి నివాళులు అర్పించారు.



Updated Date - 2022-01-05T17:48:37+05:30 IST