కృత్రిమ శ్వాస.. కన్నబిడ్డపై ధ్యాస!.. కొడుకు రాలేదని ఓ తల్లి గుండె ఘోష

ABN , First Publish Date - 2021-09-29T05:25:50+05:30 IST

కడుపులో క్యాన్సర్‌గడ్డ నొప్పికన్నా.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ.. కళ్ల ముందు లేడనే బాధే ఆమెను జీవచ్ఛవంలా మార్చింది.

కృత్రిమ శ్వాస.. కన్నబిడ్డపై ధ్యాస!.. కొడుకు రాలేదని ఓ తల్లి గుండె ఘోష
ఇంటి వద్దే.. ఆక్సిజన్‌తో కుమారుని కోసం ఎదురు చూస్తున్న తల్లి మాణిక్యమ్మ

అమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్నా కరగని కొడుకు మనసు

పోలీసులను ఆశ్రయించినా తీరని తల్లి వేదన

ప్రత్తిపాడు, సెప్టెంబరు 28: కడుపులో క్యాన్సర్‌గడ్డ నొప్పికన్నా.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ.. కళ్ల ముందు లేడనే బాధే ఆమెను జీవచ్ఛవంలా మార్చింది. కళ్లలో ఏకధాటిగా కారుతున్న కన్నీటి కన్నా.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు కాఠిన్యంగా మారాడనే వేదనే ఆమెను నిలువెల్లా దహించివేస్తోంది. కృత్రిమ శ్వాస ద్వారా ఊపిరి తీసుకుంటున్నాననే ధ్యాసకన్నా.. ఒక్కసారైనా తన కొడుకు అమ్మా అని పిలుస్తాడనే ఆశే ఆమెకు ఆయువు పోస్తుంది. ఆఖరికి పోలీసుల ద్వారా న్యాయం కోరినా.. కేసుల భూతం భయపెట్టింది. ఇదీ ప్రత్తిపాడులో ఓ అమ్మ దీనగాథ. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సమద్దిపల్లి మాణిక్యమ్మ(50) భర్త ఆరేళ్ల క్రితం మరణించారు. అనంతరం మూడేళ్లకు కొడుకు సురేశ్‌ కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురై మంచం పట్టింది. కొడుకును ఒక్కసారైనా చూడాలని, పిలిపించాలని బంధువులతో సురేశ్‌కు ఫోన్‌ చేయించి ప్రత్తిపాడు పిలిపించింది. కొడుకు మాట విన్న ఆమె ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. బిడ్డను గుండెలకు హత్తుకుని భోరున విలపించింది. కానీ కొడుకు మనసు మాత్రం కరగలేదు. తల్లి తనకు భారమంటూ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించాడు.


పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ..

తల్లి ఆలనాపాలనా చూసేందుకు సురేశ్‌ నిరాకరించడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ఎదుట కూడా తాను తల్లిని తీసుకెళ్లనంటూ మొండికేసి తన వద్ద ఉన్న శానిటైజర్‌ తాగి బెదిరింపులకు దిగాడు. దీంతో తల్లీకొడుకును బంధువులు గుంటూరు ఆస్ప్రతికి తీసుకెళ్లారు. వెంటనే కోలుకున్న సురేశ్‌.. తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. మాణిక్యమ్మకు మాత్రం లివర్‌ దెబ్బతిని.. కడుపులో క్యాన్సర్‌ గడ్డ ఏర్పడడంతో బంధువులే దగ్గరుండి ఆమెకు పది రోజులు చికిత్స ఇప్పించారు. ఇదే సమయంలో ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. గత రెండు రోజులుగా మాణిక్యమ్మ ఆక్సిజన్‌ సిలిండర్‌ సాయంతో ఇంటివద్దనే చికిత్స తీసుకుంటుంది. అనారోగ్యంతో ఉన్న ఆమెను పలకరించడానికి ఎవరొచ్చినా బిడ్డా వచ్చావా.. అంటూ మంచంపై నుంచి పైకిలేవడానికి ప్రయత్నిస్తోంది. తన కొడుకు రాలేదని తెలిసి గుండెల్లో ఆశలను కళ్లపొరల మాటున దాచుకుని వెక్కివెక్కి రోదిస్తోంది.  


పోలీసులను ఆశ్రయించినా నిరాశే..

మాణిక్యమ్మ వేదన చూసిన బంధువులు ఆమె కొడుకు సురేశ్‌ కోసం ఫోన్‌లో అనేక సార్లు ప్రయత్నించారు. అయితే తనను పదే పదే పిలిస్తే తన భార్య ద్వారా అట్రాసిటీ కేసు పెట్టిస్తానని బంధువులపై బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక వారు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. అయితే సురేశ్‌ ఫిర్యాదు చేస్తే తాము మీ (బంధువులు) మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఇదే విషయాన్ని బంధువులు  మీడియాకు తెలియజేసి కన్నీటి పర్యంతమయ్యారు. 


Updated Date - 2021-09-29T05:25:50+05:30 IST